ఇస్రో శాస్త్రవేత్త సి.వి.ఎస్.ఎస్. సౌమిత్ర
విజయవాడ : పాఠ్య పుస్తకాల్లోని అంశాలను వైజ్ఞానిక, వాస్తవిక దృష్టి కోణంతో పరిశీలించాలని, అప్పుడే నేర్చుకున్న విద్యకు సార్థకత లభిస్తుందని ఇస్రో శాస్త్రవేత్త సి.వి.ఎస్.ఎస్. సౌమిత్ర అన్నారు. చిట్టూరి హై స్కూల్ ఐదవ వార్షికోత్సవం శనివారం పాఠశాల ఆవరణలో వేడుకగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సౌమిత్ర మాట్లాడుతూ చదువంటే కేవలం అక్షరాలు నేర్చుకోవటం కాదని, పాఠాల్లోని అంతరార్థాన్ని తెలుసుకుని, దాన్ని ఆచరణలోకి తీసుకురావాలని సూచించారు. దేశభక్తి, తల్లిదండ్రుల మీద భక్తి ఉన్నప్పుడే విద్య రాణింపునకు వస్తుందన్నారు. నీతి, నిజాయితి, వ్యక్తిత్వం, క్రమశిక్షణలకు పాఠశాలలో ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం క్షణ క్షణానికి మారుతోందని, ఈ వేగాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎ. సుధారాణి వార్షిక నివేదిక సమర్పించారు. పాఠశాల సెక్రటరీ డాక్టర్ సామ మణికంఠ మాట్లాడుతూ విద్య, క్రీడలు, వ్యక్తిత్వ నైపుణ్యాల అభివృద్ధి తమ పాఠశాల విద్యా ప్రణాళికలో భాగం చేసినట్లు చెప్పారు. ఎస్.కె.పి.వి.వి హిందూ
హై స్కూల్స్ కమిటీ ట్రెజరర్ గోళ్ళ బాబా విజయ్ కుమార్, పాఠశాల విద్యావిషయక సలహాదారు కావూరి ఓంకార నరసింహం కూడా సభలో పాల్గొన్నారు. వార్షికోత్సవం సందర్బంగా నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు అతిథులు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.