రంగుమారిన ధాన్యం కొనుగోలులో సమస్యలు వస్తే పరిష్కరించాలి
పండుగలోపే నష్టపోయిన రైతులకు పరిహారం
# పండుగ వాతావరణంలో ఫించన్లు, ఆసరా మొత్తాల పంపిణీ చేపట్టాలి
# జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ
విజయనగరం : రాష్ట్రంలో ఏ ప్రభుత్వ పథకం, కార్యక్రమం అమలులోనైనా,
విజయవంతం చేయడంలో మన జిల్లా కీలకంగా నిలుస్తుందని, ఏదైనా పథకం అమలులో
వున్న లోటుపాట్లను సరిచేసి ముందుకు తీసుకువెళ్లడంలో తలమానికంగా
నిలుస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
క్షేత్రస్థాయిలో ఆయా పథకాల అమలులో వున్న ఇబ్బందులను రాష్ట్ర స్థాయిలో
ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం ద్వారా రాష్ట్ర స్థాయిలో
అన్ని జిల్లాలకు ఇది ప్రయోజనకరంగా వుంటోందన్నారు. అధికార యంత్రాంగం,
ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయడం వల్ల ఆయా పథకాల అమలు
సమర్ధవంతంగా చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. జిల్లాపరిషత్ సమావేశంలో
శుక్రవారం పలు సమస్యలపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
పార్వతీపురం జిల్లాలో ధాన్యం కొనుగోలు సమస్యలకు సంబంధించి ఇబ్బందులను
రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడి పరిష్కరించిన సందర్భంగా మంత్రి యీ
విషయాలను పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవలి తుఫాను వల్ల పాడైన,
రంగుమారిన ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఎక్కడైనా ఒకటి రెండు
చోట్ల వుంటే వాటిని వెంటనే అధికారులు పరిష్కరించాలని రాష్ట్ర విద్యాశాఖ
మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. రంగుమారిన ధాన్యం 5శాతం వరకు వుంటే
అనుమతిస్తారని, అంతకుమించి అధికశాతం వచ్చినపుడు ఆయా జిల్లాల
పౌరసరఫరాల సంస్థ అధికారులు జోక్యం చేసుకుని రైతులకు నష్టం జరగకుండా
ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాపరిషత్ సమావేశ
మందిరంలో ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన
జెడ్పీ సర్వసభ్య సమావేశంలో మిగ్జాం తుఫాను కారణంగా విజయనగరం,
పార్వతీపురం మన్యం జిల్లాల్లో దెబ్బతిన్న, రంగుమారిన ధాన్యం కొనుగోలు
విషయమై చర్చ జరిగింది. యీ సందర్భంగా రెండు జిల్లాల్లో ఎంతమేరకు రైతుల
వద్ద ధాన్యంకు నష్టం జరిగిందనే విషయమై మంత్రి ఆరా తీశారు. విజయనగరం
జిల్లాలో 4065 మెట్రిక్ టన్నులు, మన్యం జిల్లాలో 100 నుంచి 150 టన్నుల
మేరకు రంగుమారిన ధాన్యం వున్నట్టు అంచనా వేశామని ఆయా జిల్లాల వ్యవసాయ
అధికారులు రామారావు, రాబర్ట్ పాల్ తెలిపారు. జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి
శ్రీనివాసరావు మాట్లాడుతూ రంగుమారిన ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల నుంచి
ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేనిరీతిలో పౌరసరఫరాల సంస్థ అధికారులు
రైస్‌మిల్లర్లతో మాట్లాడాలని సూచించారు. ఏయే గ్రామాల్లో రంగుమారిన ధాన్యం
వుందో గుర్తించి ఆయా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతులు ఇబ్బందులు
పడకుండా చూడాలని చెప్పారు.
జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వం 4.25 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు
సిద్ధంగా వున్నప్పటికీ ఆ స్థాయిలో ధాన్యం రైతుభరోసా కేంద్రాలకు వచ్చే
అవకాశం లేదన్నారు. రెండు జిల్లాల్లో ధాన్యం కొనుగోలు పరిస్థితిని కూడా
మంత్రి సమీక్షించారు. విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు 1.40 లక్షల
టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందని పౌరసరఫరాల జిల్లా మేనేజర్
మీనాకుమారి వివరించారు. రూ.135 కోట్ల బ్యాంకు గ్యారంటీలు సిద్ధంగా తమ వద్ద
వున్నాయని చెప్పారు. సేకరించిన ధాన్యంకు రూ.98 కోట్లు చెల్లింపులు కూడా
పూర్తిచేశామని తెలిపారు. ధాన్యం ఇతర జిల్లాలకు తరలించకుండా జిల్లాలోని
రైస్ మిల్లులకే పంపించేలా చర్యలు చేపట్టాలని పౌరసరఫరాల అధికారులకు
మంత్రి సూచించారు. అవసరమైతే రాష్ట్ర స్థాయి అధికారులను కూడా సంప్రదించి
తగు ఆదేశాలు ఇచ్చేలా మాట్లాడతామని చెప్పారు.
తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలకు గాను నష్టపరిహారం రెండు జిల్లాలకు
కలిపి దాదాపు రూ.70 లక్షల వరకు వచ్చే అవకాశం వుందని, సంక్రాంతిలోగా
ప్రభుత్వం ఆయా రైతులకు పరిహారం విడుదల చేస్తుందని మంత్రి బొత్స
సత్యనారాయణ చెప్పారు. రెండు జిల్లాల్లో పంటనష్టం అంచనాలను ఆయా
వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. విజయనగరంలో 297.97
హెక్టార్లలో పంటనష్టం జరిగిందని వ్యవసాయశాఖ జె.డి. రామారావు
వివరించారు. మన్యం జిల్లాలో సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లోనే
అధికంగా పంట నష్టం జరిగిందని ఆ జిల్లా వ్యవసాయ జె.డి. తెలిపారు.
జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ నిధులతో నిర్మిస్తున్న సచివాలయాలు,
రైతుభరోసా కేంద్రాలు, వెల్ నెస్ కేంద్రాల భవనాలను వచ్చే రెండు నెలల్లో
పూర్తిచేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్
అధికారులను ఆదేశించారు. ఆ భవనాల నిర్మాణం పూర్తిచేసేందుకు ఏమేరకు నిధులు
అవసరమవుతాయో తెలియజేస్తే ప్రభుత్వం నుంచి విడుదల చేసేందుకు చర్యలు
చేపడతామన్నారు. ఈ భవనాల నిర్మాణం పూర్తిచేయడంలో మండలస్థాయి
ప్రజాప్రతినిధులు చొరవ చూపి ఎన్నికల్లోపే భవనాల నిర్మాణం పూర్తిచేసేలా
కృషిచేయాలని కోరారు. రెండు జిల్లాలో యీ భవనాల నిర్మాణాలకు కావలసిన
నిధులు, పూర్తయిన నిర్మాణాలు, మిగిలినవి ఏ స్థాయిలో పురోగతిలో వున్నాయనే
అంశంపై ఆరా తీశారు. గ్రామాల్లో సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వెల్నెస్
కేంద్రాల ఏర్పాటు, భవనాల నిర్మాణం ద్వారా ఒక్కో గ్రామంలో రూ.1.00 కోటి
విలువైన ఆస్తులు సృష్టించడం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో గ్రామ స్థాయిలో
ఎంతో పకడ్బందీ వ్యవస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఉపాధిహామీ
కన్వర్జెన్స్ నిధులతో చేపట్టిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన
అదనపు అంచనా వ్యయాన్ని చెల్లించేందుకు బొబ్బిలి పంచాయతీరాజ్ ఇ.ఇ.
నిరాకరిస్తున్నారని తెర్లాం ఎంపిపి ఉమాదేవి సమావేశంలో ప్రస్తావించగా, ఈ
విషయంలో ఇ.ఇ. శ్రీనివాసరావు వ్యవహారశైలి పట్ల మంత్రి బొత్స ఆగ్రహం
వ్యక్తంచేశారు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి అంచనా వ్యయం అదనంగా
అవుతుందనే అంశాన్ని దృష్టిలో వుంచుకొని నిర్మాణం పూర్తిచేసిన భవనాలను
అదనపు మొత్తం రూ.3.50 లక్షలు చెల్లించాలని ఇదివరకే ఆదేశాలు జారీచేసినా
వాటిని పట్టించుకోకుండా పంచాయతీరాజ్ ఇ.ఇ. వ్యవహరించడంపై మంత్రి సీరియస్
అయ్యారు. ఆయనను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని జిల్లా కలెక్టర్‌ను
ఆదేశించారు. ఈ విషయాన్ని పలుమార్లు ఇంజనీరింగ్ అధికారులకు
తెలియజేసినప్పటికీ అభ్యంతరాలు చెప్పడంపై జెడ్పీ ఛైర్మన్ మజ్జి
శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తంచేశారు.
ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిని ప్రజల్లోకి పెద్ద ఎత్తున
తీసుకువెళ్లేందుకు శాసనసభ్యులు, ఎంపిపిలు, జెడ్పీటీసీ సభ్యులు వచ్చే
రెండు నెలల్లో పూర్తిస్థాయిలో పనిచేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ
పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్నీ నెరవేర్చామనే
సంతృప్తితో ప్రజల వద్దకు వెళ్తున్నామని చెప్పారు.
జనవరి, ఫిబ్రవరి నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాల నిధులు
విడుదల చేస్తోందని వాటిని ఆయా మండలాల్లో ప్రజలను సమీకరించి యీ
కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు. ఫించను మొత్తాలను రూ.3000
పెంచి అమలు చేస్తున్నసందర్భంగా జనవరి 3 నుంచి 8వ తేదీ వరకు అన్ని
మండలాల్లో రోజుకో మండలంలో కార్యక్రమం ఏర్పాటు చేసి పండుగ వాతావరణంలో
ఫించను పంపిణీ చేపట్టాలన్నారు. 3న రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రసంగం
అన్ని గ్రామాలు, వార్డుల్లో వినేందుకు ఏర్పాట్లు చేయాలని, 4 నుంచి మండలాల్లో
పంపిణీ ఏర్పాట్లు చేయాలని, ఇందులో శాసనసభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు,
ఎంపిపిలు, స్థానిక ప్రజాప్రతినిధులంతా పాల్గొనాలని కోరారు.
జనవరి 23 నుంచి 31 వరకు వై.ఎస్.ఆర్.ఆసరా కార్యక్రమం కింద ఆర్ధిక
సహాయం పంపిణీ వుంటుందని, దీనిని కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు.
ఫిబ్రవరిలో 5 నుంచి 14వ తేదీ వరకు చేయూత పథకంలో మహిళలకు ఆర్ధిక
సహాయం అందించే కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు.
సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల
వీరభద్రస్వామి, విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి,
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, శాసనసభ్యులు బొత్స
అప్పలనరసయ్య, అలజంగి జోగారావు, శంబంగి వెంకట చినప్పలనాయుడు, శాసన
మండలి సభ్యులు రఘురాజు, రఘువర్మ, జెడ్పీ సి.ఇ.ఓ. రాజ్‌కుమార్ తదితరులు
పాల్గొన్నారు.