3వ టిఎంసి చేపట్టాల్సిన అవసరంపై వివరాలు సమర్పించాలి
ముంపు ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి ప్రణాళిక బద్ధంగా కృషి
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు చర్యలు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా సాధనకు కృషి
మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వచ్చిన రాష్ట్ర మంత్రుల బృందం
జయశంకర్ భూపాలపల్లి : కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవిక అంశాలను ప్రజల ముందు
ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర
నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం
భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ ని రాష్ట్ర
నీటిపారుల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ గృహ
నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర
ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర
రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లతో కూడిన మంత్రుల బృందం రాష్ట్రస్థాయి
నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇతర సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనార్థం జిల్లాకు వచ్చిన మంత్రుల బృందానికి జిల్లా
కలెక్టర్ ఘన స్వాగతం పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ,మేడిగడ్డ
బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మత్తు మొదలగు అంశాల పై
రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈ.ఎన్.సి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. మేడిగడ్డ
బ్యారేజీ 7వ బ్లాక్ లో మేడిగడ్డ లోని ఒక పిల్లర్/ పియర్ 1.256 మీటర్ల వరకు
కుంగిందని, డ్యామేజ్ ఇంకా నిర్దారణ జరుగుతోందని, ప్రస్తుతం కాపర్ డ్యాం
నిర్మాణం జరుతోందని, ఈ నిర్మాణం అనంతరం మరమ్మత్తులు లేదా పునర్ నిర్మాణం
చేయాల్సి ఉందని, కొత్త గేట్లు కూడా అమర్చాల్సి ఉంటుందని నిపుణుల కమిటీ
సూచీoచిందని ఈ.ఎన్.సి తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి
ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ హయాంలో 38 వెల కోట్ల తో
16.40 లక్షల ఎకరాల ఆయకట్టు అందించేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు
ప్రణాళిక రూపొందించడం జరిగిందని, 11వేల కోట్లు సైతం ఖర్చు చేసామని, తెలంగాణ
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రాజెక్టు ప్రణాళిక ను మేడిగడ్డ వద్దకు
మార్చిందని, ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.95,000 కోట్ల ఖర్చు చేసి,
దాదాపు లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు ఏర్పడిందని అన్నారు. ప్రపంచం లోనే అతి పెద్ద
ప్రాజెక్టు అని చెప్పారు, అద్భుతం అన్నారని, కానీ మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్
కావడం దురదృష్టమని, అక్టోబర్ 21 నాడు ప్రాజెక్టు పెద్ద శబ్దం తో కుంగడం
జరిగిందని, ఆనాటి ముఖ్య మంత్రి,ఇరిగేషన్ మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి
నోరు మెదపలేదని, ఎక్కడ రివ్యూ చేయలేదని,స్టేట్ మెంట్ ఇవ్వలేదని అన్నారు.
సి.డబ్ల్యూ.సి ప్రాజెక్టు నిర్మాణానికి 80 వేల కోట్లకు ఆమోదిస్తే ఇప్పుడు
లక్ష నర కోట్లు వరకు ఖర్చు జరుగుతుందని అన్నారు. మేడిగడ్డ ఒక్కటే కాదని,
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా నష్టం జరిగిందని, వాటిని పరిశీలించాలని
అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు లో
జరిగిన అవకతవకల పై జ్యూడిషల్ విచారణ చేపడుతామని అన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం
కాళేశ్వరానికి జాతీయ హోదా సాధించడంలో విఫలమయ్యారని, ప్రస్తుతం పాలమూరు
రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించే దిశగా తమ ప్రభుత్వం చర్యలు
తీసుకుంటుందని అన్నారు.
రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగి పోవటం, నష్టం వివరాలు ప్రజలకి
వివరించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రాష్ట్రా సంపద సక్రమంగా
వినియోగించాలని ఉద్దేశంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.గోదావరి జలాలతో
భూపాలపల్లి పెద్దపల్లి కి సాగునీరు, తాగునీరు అందించాలని, మంథని ప్రాంతం
పూర్తిస్థాయిలో నష్టపోయిందని ప్రత్యేక ప్రణాళిక ద్వారా ముంపు ప్రాంతాలను
ఆదుకోవాలని ఆయన కోరారు.
రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ
తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్ట్ కట్టి ఉంటే తెలంగాణ కు గ్రావిటీ
ద్వారా సాగునీరు వచ్చి ఎంతో లాభం జరిగేదని, గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల
తెలంగాణ కు నష్టం జరిగిందని, పంపు హౌస్ లలో నాణ్యత లేని మోటర్లును బిగించారని,
పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అన్నారు.అవసరం లేకున్నా 3 వ టిఎంసి పనులు
చేపట్టారని ఈ ప్రాజెక్టుకు వాడిన మోటార్లు మొత్తం అసెంబులెడ్ మోటార్లని, ఒక్కో
మోటర్ కు రూ. 4 వేల కోట్లు చెల్లించారని, నల్లగొండ జిల్లా కు సాగునీరందించే
ప్రాజెక్టులపై చిన్న చూపు చూసారని మంత్రి అన్నారు.
రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్
రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 148 మీటర్లకే ఒప్పందం
చేసుకున్నారని, దీని వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని, చేపట్టిన నిర్మాణాలు
నాణ్యత గా కట్టివుంటే ఈ సమస్య వచ్చి ఉండేదా అని ప్రశ్నించారు. 2022
ఏప్రిల్ 28 న మేడిగడ్డ బ్యారేజీలో సమస్య ఉందని, వెంటనే మరమ్మతులు చేసి ఉంటే
ఇలా అయ్యేది కాదని అన్నారు. టెండర్లలో చూపిన ఆసక్తి నాణ్యతలో కానీ మరమ్మతులు
లో కానీ ఎందుకు చూపలేదని, వీటన్నింటిపైన సమాదానాలు చెప్పాలని, ఇది ఒకటో రెండో
పిల్లర్లతో ఆగదని, రాఫ్ట్ కింద ఉన్న ఇసుక ప్రపర్ చూసి ఉంటే ఇలా అయ్యేది కాదని
అన్నారు. వరదలు వచ్చునపుడు స్టాప్ లాక్ గేట్లు ఎందుకు పనిచేయలేదని,పని
చేయకపోతే అందుకు సంబంధించిన అధికారులపైన ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఉన్న
నీటినే సక్రమంగా వాడలేనప్పుడు , మరి మూడో టీఎంసీ నీటి వినియోగానికి ఎందుకు
నామినేషన్ లో పనులు మొదలు పెట్టారని, ఈ పనులలో టన్నెల్ కాదని ఆఘమేఘాల మీద పైపు
లైన్ లు పనులు చేశారనే అంశాల పై తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. అనంతరం
మంత్రుల బృందం మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ప్రదేశాన్ని పరిశీలించారు. మేడిగడ్డ
బ్యారేజ్ నుంచి 4.30 గంటలకు మంత్రుల బృందం అన్నారం బ్యారేజీ పరిశీలనకు
బయలుదేరి అన్నారం బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు 4.46 నిమిషాలకు
మంత్రుల బృందం చేరుకున్నారు. అన్నారం బ్యారేజీని మంత్రుల బృందం పరిశీలించిన
అనంతరం హైదరాబాద్ కు సాయంత్రం 5 గంటల 18 నిమిషాలకు బయలుదేరారు. ఈ
కార్యక్రమంలో అర్&బి శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, బి.సి సంక్షేమ
శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎం.ఎల్.సి. జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్
భవేష్ మిశ్రా,జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, ఈ ఎన్ సి మురళీదర్ రావు, ఈ.ఈ తిరుపతి
రావు,తదితర అధికారులు, ఇప్పుడు జడ్పిటిసిలు, ఎంపీపీలు, పాల్గొన్నారు