మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రత్యేక దృష్టి
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
వెలగపూడి : మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రత్యేక ద్రుష్టి సారించి
సాధ్యమైనంత వరకు అన్ని పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పురపాలక
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మున్సిపల్
కార్మిక సంఘాల నాయకులతో మంత్రి సమావేశమై మాట్లాడారు. దాదాపు 7 గంటలపాటు
సుధీర్గంగా వారి సమస్యలు విన్నారు. సచివాలయంలోని మంత్రి చాంబర్లో జరిగిన ఈ
సమావేశంలో యూనియన్ ప్రతినిధులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
వారి సమస్యల్లో కొన్నిటిపై సానుకూలంగా స్పందించటంతో పాటు మరికొన్ని జి.ఓ.ఎం లో
చర్చిస్తామని అన్నారు. సమ్మె విరమించాలని సమ్మెలో ఉన్న సంఘ నాయకులకు
సూచించటంతో పునరాలోచిస్తామని వారు మంత్రికి సానుకూలంగా చెప్పారు. ఈ సందర్బంగా
మీడియాతో మంత్రి సురేష్ మాట్లాడుతూ మొత్తం పురపాలక సంఘాల్లో 41 చోట్ల 100 శాతం
కార్మికులు పనిలో ఉన్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 48,753 మంది
కార్మికులకు గాను కేవలం 19,162 మంది మాత్రమే సమ్మెలో ఉన్నారని ఎక్కడ కూడా
ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్పారు.
కార్మికులకు సంబంధించిన కొన్ని సమస్యలను గుంటూరు, విజయవాడ, మార్కాపురం కమిషనర్
లతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించామని చెప్పారు. 72 మంది కార్మికులకు
సంబంధించిన హెల్త్ అలవెన్స్ ల సమస్యను గుంటూరు మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి
తక్షణ చర్యలకు ఆదేశాలు ఇవ్వటం జరిగిందన్నారు. కొన్ని చోట్ల కారుణ్యనియామకాలు
భర్తీ చేయాలని ఆదేశించామని చెప్పారు. అన్ని చోట్ల పి. ఎఫ్ ల సమస్యల పరిష్కారం
కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆప్కాస్ ద్వారా
కొన్ని ఇబ్బందులు ఉన్నాయని సూచించటంతో సాంకేతిక సమస్యలు పరిష్కారానికి చర్యలు
తీసుకోవాలని ఆదేశించామని అన్నారు. గత ప్రభుత్వం పారిశుధ్య కార్మికులను
విస్మరించారని, కానీ జగనన్న వారికి అన్నివిధాలా మేలు జరిగేలా చర్యలు తీసుకోవటం
జరిగిందన్నారు. సంఘాల నాయకులు సూచించిన అన్ని విషయాలు సీఎం వై.ఎస్ జగన్మోహన్
రెడ్డి ద్రుష్టికి తీసుకెళ్తామని, సమ్మె విరమిస్తారని భావిస్తున్నామని మంత్రి
సురేష్ తెలిపారు. సమావేశంలో మంత్రితో పాటు సిడిఎంఏ కోటేశ్వరరావు, ఆప్కాస్ ఎం.
డి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.