జగన్వన్నీ అబద్ధాలు..85 శాతం హామీలు ఎగ్గొట్టారు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
టీడీపీ జాతీయ కార్యాలయంలో “నవరత్నాలు నవమోసాలయ్యాయి” అనే పుస్తకాన్ని
ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
మంగళగిరి : నాలుగున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.10 లక్ష కోట్ల అప్పులు
చేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు.
‘జగన్ రెడ్డి హామీల అమలులో 85శాతం ఫెయిల్’ పుస్తకాన్ని పార్టీ కేంద్ర
కార్యాలయంలో టీడీపీ సీనియర్ నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా
అచ్చెన్నాయుడు మాట్లాడారు. 99 శాతం హామీలు అమలు చేశామని సీఎం జగన్ అబద్ధాలు
చెబుతున్నారన్నారు. పచ్చి అబద్ధాలకోరు జగన్ రెడ్డి అని, ప్రజలకు ఇచ్చిన
హామీలు 730.. అమలుచేసింది కేవలం 109 అంటే 15శాతం మాత్రమే అన్నారు. 99.5 శాతం
హామీలు అమలుచేశానని చెప్పుకోవడం పచ్చి అబద్ధాలని, నిలువెత్తు మోసాలకు
ప్రతిరూపమైన జగన్ రెడ్డికే చెల్లిందని కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.
జగన్ రెడ్డి ఎంత మోసగాడో, ఎంత పచ్చి అబద్ధాలకోరో ప్రజలకు తెలియచేయడానికే ఈ
పుస్తకం తీసుకొచ్చామని వివరించారు.
పార్లమెంట్ల వారీగా భారీ బహిరంగసభలు : జగన్ రెడ్డి మోసాలను ప్రతి ఇంటికి,
ప్రతి వ్యక్తికి తెలియచేస్తాం, త్వరలోనే పార్లమెంట్ల వారీగా భారీ బహిరంగసభలు
నిర్వహించి జగన్ రెడ్డి వంచనను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తాం. సాక్షి
దినపత్రిక, సాక్షి టీవీ ప్రచారం చేసిన జగన్ రెడ్డి హామీలన్నీ జనం ముందు
ఉంచుతాం. పచ్చి అబద్ధాలు, మోసాలకు నిలువెత్తు ప్రతిరూపం జగన్ రెడ్డి అని
ప్రజలకు తెలియాలి. పాదయాత్రలోగానీ, ఎన్నికల సమయంలో గానీ, వివిధ సందర్భాల్లో
జగన్ ప్రజలకు ఇచ్చిన మొత్తం హామీలు 730. అధికారంలోకి వచ్చాక నెరవేర్చింది
కేవలం 109 (15శాతం) మాత్రమే. 85 శాతం హామీలు విస్మరించి ప్రజల్ని వంచించడమేనా
జగన్ రెడ్డి నీతి, నిజాయితీ, నిబద్ధత?. తన మేనిఫెస్టో బైబిల్ తో సమానమని
చెప్పుకునే జగన్ రెడ్డి. మేనిఫెస్టోలోని అంశాలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు
సమాధానం చెప్పాల్సిందే. మాటమీద నిలబడకుంటే పదవికి రాజీనామా చేయాలని గతంలో
ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయనందుకు
లెంపలేసుకొని, తప్పుఒప్పుకొని తక్షణమే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని
అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
మంత్రులు ఒక్కసారి ఎన్నికల వెబ్ సైట్ చూడాలి : తెలుగుదేశం పార్టీ,
చంద్రబాబునాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని ప్రతిపక్షనేతగా
గగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి రాకముందు ఎన్ని
హామీలుఇచ్చి, ముఖ్యమంత్రి అయ్యాక ఎన్ని నెరవేర్చా డో ప్రజలు తెలుసుకోవాలని
అచ్చెన్నాయుడు సూచించారు. తన మేనిఫెస్టో తనకు బైబిల్ అని, తూచా తప్పకుండా
దానిలోని ప్రతి హామీని అమలుచేశానని, 99.5 శాతం హామీలు పూర్తిచేశానని జగన్
రెడ్డి పచ్చి అబద్ధా లు చెబుతున్నాడు. చంద్రబాబు గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలు
అమలు చేయలేదని, టీడీపీ మేనిఫెస్టోను కూడా వెబ్ సైట్ లో లేకుండా తొలగించాడని
జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం పదేపదే దుష్ప్రచారం చేసింది. జగన్ రెడ్డి మాటలకు,
చేతలకు మధ్య ఉన్న వ్యత్యాసం ప్రజలకు తెలియచేయడానికే నేడు టీడీపీ తరపున
‘నవరత్నాలు + మేనిఫెస్టో + జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85శాతం ఫెయిల్
(నవరత్నాలు నవమోసాలయ్యాయి)’ పుస్తకాన్ని ప్రజల ముందు ఉంచుతున్నాం. ఎన్నికల
కమిషన్ వెబ్ సైట్లో చూస్తే 2014-19 మధ్య చంద్రబాబు అమలుచేసిన 99శాతం హామీలు,
టీడీపీ మేనిఫెస్టో జగన్ రెడ్డికి, వైసీపీనేతలకు అద్దంలా కనిపిస్తుంది 2014-19
టీడీపీ మేనిఫెస్టో ప్రజలకు అందుబాటులో ఉంచలేదని చెబుతున్న ముఖ్యమంత్రి,
వైసీపీనేతలు, మంత్రులు ఒక్కసారి ఎన్నికల వెబ్ సైట్ చూస్తే దానిలో చంద్రబాబు
నాయుడి మేనిఫెస్టో అద్దంలా కనిపిస్తుంది. ఆ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను
చంద్రబాబు 99శాతం పూర్తిచేశాడనే నిజం కూడా అది చూసిన వారికి బోధపడుతుందన్నారు.
ఎన్ని హామీలు నెరవేర్చాడో ప్రజలకు నిజం చెప్పాలి : పాదయాత్రలో గానీ, ఎన్నికల
సమయంలో గానీ, ఇతరత్రా వివిధ సందర్భాల్లో జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మొత్తం
హామీలు 730. ఆ హామీలన్ని ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ఇచ్చాడనే పూర్తి వివరాల్ని
కూడా 150 పేజీల ఈ పుస్తకంలో తెలియచేశాం. అలానే జగన్ రెడ్డి ప్రజలముందు
చేతులూపుతూ చెప్పిన మాటల్ని కూడా దృశ్యరూపంలో (వీడియోలు) ప్రజల ముందు
ఉంచుతున్నాం. అధికారం చేపట్టిన ఈ 4 ఏళ్ల 8 నెలల్లో జగన్ రెడ్డి ఎన్ని హామీలు
నెరవేర్చాడో ప్రజలకు నిజం చెప్పాలి. 99.5 శాతం హామీలు నెరవేర్చాన ని
నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. 730 హామీల్లో జగన్ రెడ్డి కేవలం
109 మాత్రమే అమలుచేశాడు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో 85శాతం హామీలు ఎగ్గొట్టి,
సిగ్గులేకుండా ఇంతగా బరితెగించి అబద్ధాలు చెప్పడం జగన్ రెడ్డికే
చెల్లిందన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నేతలు బొండా
ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, టీ.డీ.జనార్థన్, పరుచూరి
అశోక్ బాబు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మొహమ్మద్ నసీర్ అహ్మద్, ధారునాయక్
తదితరులు పాల్గొన్నారు.