తెలుగు వారు ఎక్కడున్నా ఎన్నికల సమయం లో రాష్ట్రం కోసం అడుగు వేయాలి
బెంగళూరు టీడీపీ ఫోరం సమావేశంలో అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు
బెంగళూరు :- నవశకం తెలుగువారి సొంతం కావాలని, నంబర్ వన్ గా తెలుగుజాతి
ఉండాలనేదే తన విజన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో థింక్
గ్లోబల్లీ….యాక్ట్ లోకల్లీ ఉండేదని..కానీ ఇప్పుడు థింక్ గ్లోబల్లీ..యాక్ట్
గ్లోబల్లీ అనేది తన కొత్త నినాదమని పేర్కొన్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో
మూడు రోజుల పర్యటన కు వెళ్లేందుకు బెంగుళూరు ఎయిర్ పోర్ట్ కు వచ్చిన
చంద్రబాబు….ఇక్కడ జరిగిన బెంగుళూరు టీడీపీ ఫోరం మీటింగ్ లో పాల్గొన్నారు.
ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం కెఎమ్ఎమ్ కన్వెన్షన్ హాలుకు చేరుకున్న చంద్రబాబు పార్టీ బెంగళూరు ఫోరం
సభ్యులు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన తర్వాత ఎన్టీఆర్
విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు నాయుడు
మాట్లాడుతూ…‘‘పార్టీలో మేము అన్నిరంగాల వింగ్ లు ఏర్పాటు చేశాంకానీ…మీరు
స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బెంగళూరు ఫోరం ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా
అభినందిస్తున్నా. మీలో యువశక్తి కనబడుతోంది..భవిష్యత్ మీదే. నాకు కష్టం
వచ్చినప్పుడు ఏ విధంగా మీరు అండగా నిలబడ్డారో ఇప్పుడు మీ ఉత్సాహం చూస్తే
కనిపిస్తోంది. నేను చేసిన మంచి పనులు వల్ల నాకు మద్ధతుగా 70 దేశాల్లో ఉన్న
తెలుగువారు గుర్తు పెట్టుకుని ముందుకొచ్చి మద్ధతు తెలిపారు. అందుకు
మనస్ఫూర్తిగా ధన్యావాదాలు, అభినందలు చెప్తున్నా. తెలుగు వారంటే గతంలో ఏపీకి
మాత్రమే పరిమితం. కానీ నేడు తెలుగువారు ఏపీ, తెలంగాణలోనే కాకుండా చెన్నై,
బెంగళూరు ఇలా ఏ సిటీకి వెళ్లినా మన వాళ్ల ప్రతిభ కనిపిస్తుంది. ఇది ఎంతో గర్వ
కారణం.
ప్రతి ముగ్గరు ఐటీ ప్రొఫెషనల్స్ లో ఒక తెలుగువాడు
మన దేశంలోనే కాదు..ప్రపంచం మొత్తంలో తెలుగు వారు విస్తరిస్తున్నారు. ఏ
దేశానికి వెళ్లినా ప్రముఖ స్థానాల్లో మన తెలుగు వారు ఉండటం సంతోషంగా ఉంది.
నేను సీఎం అయిన తొలిరోజుల్లో తెలుగు వాళ్లు అప్పటిదాకా ఎక్కువగా వ్యవసాయం
చేస్తూ, వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ ఎందుకు కాకూడు,
ఒక కూలీ చేసుకునే వ్యక్తి వారి కొడుకుని ఐటీ ప్రొఫెషనల్ ఎందుకు చేయకూడదు అని
ఆలోచించాను. అందుకే నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టా. అదే ఐటీ. ఎడ్ల బండ్ల
నుండి డ్రైవర్ లెస్ కార్ల దాకా టెక్నాలజీ వచ్చింది. అభివృద్ధిలో చాలా ముందకు
వెళ్తున్నాం. నాడు నేను ఐటీనీ ప్రారంభించినప్పడు ఎగతాళి చేశారు. గతంలో ఐటీ
అంటే బెంగళూరు మాత్రమే ఉండేది..కానీ బెంగళూరుతో పోటీపడి హైదరాబాద్ ఉండాలని,
నాలెడ్జ్ ఎకానమీతో హైదరాబాద్ ను ప్రపంచం పటంలోనే పెట్టాం. ముగ్గురిలో ఐటీ
ప్రొఫెషనల్ లో మన తెలుగువారు ఒకరున్నారు. నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచంలోనే
ముందకు వెళ్తున్నాం. ఫార్మారంగం, బయో టెక్నాలజీతో పాటు ఏ సెక్టార్ తీసుకున్నా
నాలెడ్జ్ ఎకానమీ కి ఎప్పుడూ ఐటీ బ్యాక్ బోన్ గా తయారైంది. ఉద్యోగాలు చేయడం
కాదు..మీరు ఉద్యోగాలు మీరివ్వాలనేదే నా ఆకాంక్ష. ప్రపంచంలో ఏ దేశానికెళ్లినా
మన వాళ్లు ఉద్యోగాలు చేస్తూ పెట్టుబడులు పెట్టి స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు
చేస్తున్నారు. దేశంలో అగ్రస్థానంలోనే తెలుగు జాతి ఉండాలి. లోకేషన్ అనేది ఈ
రోజుల్లో సమస్య కాదు..ఎక్కడున్నా నాలెడ్జ్ ఉంటే ప్రపంచం మొత్తం సేవలందించే
నెట్ వర్క్ అందించే శక్తి తెలుగువారికి ఉంది. దేశానికి మంచి ఆస్తిగా
టెక్నాలజీని అందించాలనేది నా ఆశ. సంస్కరణల వల్ల దేశానికి సంపద సృష్టించే
అవకాశం వచ్చింది.
2047 నాటికి ప్రపంచంలోనే అగ్రగామిగా మనదేశం
2047 నాటికి ప్రపంచానికే నాయకత్వం ఇచ్చేది మన భారతదేశమే. నేను విజన్ 2020 అంటే
ఆనాడు ఎగతాలి చేశారు..నన్ను 420 అని కూడా విమర్శించారు. ఆ 2020 విజన్ తో
అసోషియేట్ అయిన వాళ్లు నేడు బ్రహ్మాండంగా ముందకు వచ్చారు. 2047 నాటికి
ప్రపంచంలోనే భారతదేశం అగ్రదేశంగా, అభివృధ్ధి చెందిన దేశంగా నెంబర్ వన్
స్థాయిలో ఉంటుంది. దేశంతో పాటు మన రాష్ట్రాన్ని కూడా మనం కాపాడుకోవాలి..దాని
బాధ్యత తెలుగు వాళ్లు ఎక్కడున్నా వారిపై ఉంది. రాష్ట్రం కోసం నేను
పోరాడతా..కానీ దానికి మీ సహకారం కావాలి. దేశానికి పీవీ నరసింహారావు ఆర్థిక
సంస్కరణలు వచ్చాక దశదిశ మారింది. ఐటీని ప్రొమోట్ చేయాలని పబ్లిక్ పాలసీ
తీసుకొచ్చాం. రోడ్లు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి వాటిపై పబ్లిక్ పాలసీ
ఏర్పాటు చేసి ముందుకు వెళ్తాలి. 21వ శతాబ్దం నాలెడ్జ్ ఎకానమీకి నాంది. 2047
నాటికి మనదేశం అగ్రగామిగా మారుతుందంటే అది దేశానికి దక్కే అరుదైన గౌరవం.
బెంగళూరు టీడీపీ ఫోరం ప్రారంభించారు..మంచి పరిణామం. గతంలో ఆడపిల్లలను
తల్లిదండ్రులు చదివించడానికి శ్రద్ధ చూపించేవారు కాదు..ఎంతోకొంత చదివించి
పెళ్లి చేసి పంపించేవారు. అందుకే నాడు ఆలోచించా… ఉద్యోగాల్లో 33 శాతం
రిజర్వేషన్లు పెట్టి ప్రోత్సహించాం. ఆడపిల్లలు ఎంత మంచిగా చదువుకుంటే
సమాజానికి అంత మంచిందని ఆలోచించాను.
మీరే ఉద్యోగాలిచ్చే స్థాయికి వెళ్లాలి
ఏ కులమైనా, ఏ మతమైనా మన దేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం.
ఇంటికి వస్తే కష్టాలు మరిచి కుటుంబాన్ని చూసి మళ్లీ యాక్టివేట్ అయ్యే సంస్కృతి
మన దేశంలో మాత్రమే ఉంది. ఇప్పుడు ఏపీలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయి.
పబ్లిక్ – ప్రైవేట్ పార్టనర్ షిప్ విధానం ఉండాలని సంకల్పించాను. ఫ్లైఓర్లు,
రోడ్లు, ఎయిర్ పోర్టులు వచ్చింది కూడా పీపీపీ మోడల్ లోనే. ఈ విధానం వల్ల సంపద
బాగా పెరిగింది. ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా
జీవిత ఆశయం. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్ షిప్ పాలసీ ద్వారా సంపద
సృష్టించే విధానం రావాలి. ఆ వ్యవస్థకు నేను శ్రీకారం చుట్టాలనుకుంటున్నా. మీరే
కాదు..మీతో సమానంగా మీ పక్క కుటుంబం పైకి రావాలి. మీ శక్తికి తగ్గట్టుగా
కుటుంబాలను పైకి తీసుకొస్తే మన జన్మ సార్ధకం అవుతుంది. ప్రజలను, జనాభాను
ఆస్తిగా భావించి ప్రణాళిక సిద్ధం చేస్తే వారి నుండి పేదరికాన్ని తరిమేయవచ్చు.
నేను సాదారణ కుటుంబంలో పుట్టాను. నేను చదువుకునే రోజుల్లో మా ఊరికి రోడ్డు
లేదు..విద్యుత్ లేదు. అప్పటి కంటే ఇప్పటి పరిస్థితులు బెటర్.
తెలుగుజాతి రుణం తీర్చుకుంటా
బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులు నేటి నుండి వందరోజుల ఒక ప్రణాళిక తయారు
చేసుకోవాలి. మీ భవిష్యత్తుతో పాటు ఏపీ భవిష్యత్తు ను తీర్చిదిద్దే బాధ్యతను
కూడా మీరు తీసుకోవాలి. షార్ట్ టర్మ్ యాక్షన్ ప్లాన్ ద్వారా ఏం చేయగలుగుతారో
ముందే ఆలోచించుకోండి. మీ గ్రామాలకు వెళ్లి ప్రజలను చైతన్యపరచాలి. విద్యార్థి
నాయకుడిగా ఉండి కూడా నేను మొదటిసారి ఎమ్మెల్యే అయింది యువత వల్లనే. మీరు
పబ్లిక్ పాలసీ ద్వారా ఎలా బాగుపడ్డారో మీ గ్రామాల్లోని ప్రజలకు చెప్పాలి.
రోజుకు ఒక గంట మీరు ఇతరులతో ఫోనులో మాట్లాడాలి..ఎన్నికలు రాష్ట్రానికి ఎందుకు
ముఖ్యమో వివరించాలి. మనం ఫోన్ ద్వారా కనీసం పది మందిని మార్చగలిగితే పార్టీకి,
రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఎన్నికలొచ్చినప్పుడు ఎవరెళ్తారు ఊర్లకు
అనుకోకుండా 10 రోజులు సెలవు పెట్టివెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి.
అవసరం అయితే ఇప్పటి నుండే సంపాదించిన డబ్బుల్లో చారిటీకి ఖర్చు
పెట్టండి..రాజకీయాలకు ఖర్చు పెట్టండి..ప్రజల కోసం గ్రామానికి ఖర్చు పెట్టండి.
మనిషికి వెయ్యి వేసుకున్నా లక్షల్లో పోగేయవచ్చు..ఆ డబ్బులతో మంచి పనులు చేస్తే
ప్రజలు మిమ్మల్ని గుర్తుంచుకుంటారు..మీరు సూచించిన పార్టీకి ఓట్లేస్తారు. నాకు
పదవులు, డబ్బులు, లగ్జరీ జీవితం అవసరం లేదు. నేనేం చేశానో తర్వాత తరాలు
గుర్తుంచుకోవాలనే పని చేస్తున్నా. కులం, మతం, ప్రాంతం లేదు..నా ధ్యాస అంతా
తెలుగు జాతిపైనే. ఒకే కులం తెలుగు, ఒకే మతం తెలుగు..ఒకే ప్రాంతం తెలుగు..మన
గడ్డ తెలుగు గడ్డ మాత్రమే. మన మేథోసంపతితో తెలుగుజాతిని అగ్రస్థానంలో
నిలబెట్టాలి. ప్రపంచమే హద్దుగా తెలుగుజాతి ఎదగాలి’’ అని చంద్రబాబు నాయుడు
ఆకాంక్షించారు.