వైయస్ షర్మిల క్రిస్టమస్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం జాతీయ
ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కానుక పంపారు. లోకేష్ కుటుంబానికి క్రిస్మస్
పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ నోట్ ను కూడా పంపారు. షర్మిల పంపిన క్రిస్మస్
కానుకను స్వీకరించిన నారా లోకేష్ ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదిక
ఎక్స్ ద్వారా షేర్ చేశారు. అంతేకాదు ప్రియమైన షర్మిల గారు మీరు పంపిన
అద్భుతమైన క్రిస్మస్ కానుకలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
మీకు, మీ కుటుంబానికి ఈ క్రిస్మస్ తో పాటు.. నూతన సంవత్సరం కూడా సంతోషకరంగా
సాగిపోవాలని నారా కుటుంబం కోరుకుంటున్నదని ట్వీట్ చేశారు. అలాగే.. షర్మిలకు
కూడా లోకేష్ గిఫ్ట్ పంపారు. ఇప్పుడు ఈ వార్త పెను సంచలనంగా మారింది.
కాంగ్రెస్ లో విలీనం, ఏపీ సారథ్య బాధ్యతలు వంటి విషయాలు వెనక్కు వెళ్లి షర్మిల
ఏకంగా తెలుగుదేశం అభ్యర్థిగా కడప నుంచి లోక్ సభకు పోటీ చేయనున్నారని సోషల్
మీడియా కోడై కూస్తోంది. జనం దీనిని ఏపీ రాజకీయాలలో చోటు చేసుకోబోతున్న పెను
మార్పులకు, సంచలనాలకు సంకేతంగా లోకేష్ కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ ను
భావిస్తున్నారు. ఈ విషయం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
తన అన్న జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థి అయిన నారా లోకేశ్‌కు
షర్మిల క్రిస్మస్ గిఫ్ట్‌లు పంపడం వెనక సంకేతం ఏంటనే చర్చలు సహజంగానే
తెరమీదకు వచ్చాయి. గతంలో అన్నతో వచ్చిన విభేదాల కారణంగా షర్మిల తెలంగాణలో
పార్టీ పెట్టి.. అసెంబ్లీ ఎన్నికల్లో దిగేందుకు సుదీర్ఘంగా పాదయాత్ర
చేపట్టారు. కానీ చివరి నిమిషంలో ఆమె ట్విస్ట్ ఇచ్చి కాంగ్రెస్ కు
మద్దతిచ్చారు. దీనిపై కూడా అప్పట్లో పరిశీలకులు పలు రకాల విశ్లేషణలు చేశారు.
అంతకు ముందు అసలు షర్మిల తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నట్లు
కూడా కథనాలొచ్చాయి. అందుకు తగ్గట్లు అప్పట్లో చర్చలు, ఏర్పాట్లు కూడా జరిగాయి.
కానీ, అనూహ్యంగా విలీనం ప్రస్తావన ఆగిపోవడం, తెలంగాణ ఎన్నికలలో కూడా షర్మిల
దూరంగా ఉండటం జరిగిపోయాయి. కాగా, ఇప్పుడు షర్మిలకి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు
అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్నది. త్వరలోనే షర్మిల ఏపీ రాజకీయాలలో పునః
ప్రవేశం చేయనున్నారని, అందుకు తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని
చెప్తున్నారు. ఆ వార్తలు ఒక వైపు కొనసాగుతుండగానే.. ఇప్పుడు నారా లోకేష్ కు
షర్మిల క్రిస్మస్ బహుమతులు పంపించడం ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా
కాంగ్రెస్ పార్టీతో పొత్తు, లేదా విలీనం ప్రతిపాదన సమయంలో షర్మిల రాహుల్
గాంధీకి ట్వీట్ చేశారు. కాంగ్రెస్ తో పొత్తు కోసం ప్రయత్నాలలో భాగంగానే
అప్పట్లో షర్మిల ఈ తరహా ట్వీట్ చేసినట్లు రాజకీయవర్గాలలో చర్చ జరిగింది.
ఇప్పుడు షర్మిల లోకేష్ కు క్రిస్మస్ బహుమతులు పంపారన్న దానిపై పరిశీలకులు
ఆసక్తికర విశ్లేషణలు చేస్తున్నారు. షర్మిల తెలుగుదేశం అండతో లేదా, ఆ పార్టీ
అభ్యర్థిగా కడప ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నాయన్నది పరిశీలకులు విశ్లేషణ.
దీనిపై వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. షర్మిలపై ఇష్టారీతిగా విమర్శలు
గుప్పిస్తున్నాయి. వైఎస్ బిడ్డ తెలుగుదేశంలో చేరడమా అంటూ నిలదీస్తున్నాయి. ఇక
జగన్ అభిమానినని చెప్పుకునే శ్రీరెడ్డి అయితే షర్మిలపై దూషణల పర్వానికి
దిగారు. అయితే సామాజిక మాధ్యమంలో వైసీపీ శ్రేణుల విమర్శలకు, దూషణలకు నెటిజన్లు
దీటుగా జవాబిస్తున్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమార్తె
పురంధేశ్వరి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి, కేంద్ర మంత్రి కాగలిగినపుడు..
కాంగ్రెస్ పార్టీలో సీఎంగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, సీఎం జగన్
సోదరి షర్మిల తెలుగుదేశం నుంచి పోటీ చేయడం తప్పు ఎందుకు అవుతుందని
నిలదీస్తున్నారు. అయితే పోటీ, తెలుగుదేశం ప్రవేశం వంటి విషయాలపై షర్మిల
నుంచి ఇప్పటి వరకూ సమర్ధన కానీ, ఖండన కానీ రాలేదు. కానీ ఈ నెల 21 సీఎం
జగన్ పుట్టినరోజు వేడుకను రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించారు.
వైసీపీ శ్రేణులు భారీగా జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వైసీపీ నేతలతో
పాటు ఆయన రాజకీయ ప్రత్యర్ధులు సైతం జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే
జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన
దాఖలాలు లేవు. . కనీసం సోషల్ మీడియాలో కూడా షర్మిల తన అన్నకు శుభాకాంక్షలు
తెలియజేయలేదు. కానీ క్రిస్మస్ పండగకు ఏకంగా లోకేష్ కు షర్మిల బహుమతులు
పంపించారు. నిజానికి షర్మిల గతంలో వైసీపీ పాదయాత్ర సమయంలో లోకేష్ పై తీవ్ర
విమర్శలు చేశారు. రాజకీయ విమర్శలతో పాటు, వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు.
అలాంటి షర్మిల ఇప్పుడు ఇలా బహుమతులు పంపడం ఒక విధంగా జగన్ కు తనకు చేసిన
అన్యాయాన్ని గుర్తు చేస్తూ రిటర్న్ గిఫ్ట్ పంపడమేనని పరిశీలకులు
విశ్లేషిస్తున్నారు.
ఏది ఏమైనా షర్మిల లోకేష్ కు క్రిస్మస్ కానుకలు పంపించడం జగన్‌కు షాక్ అనడంలో
సందేహం లేదు. మహాభారత యుద్ధంలో ఓటమి ముంగిట ఉన్న దుర్యోధనుడు ఒక్కొక్కరుగా
హితులు, సన్నిహితులు బంధువులు దూరం కావడాన్ని తలచుకుని వగచిన సందర్భం గుర్తుకు
వస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు జగన్ కు కూడా కుటుంబంలో, పార్టీలో
అందరూ కాకపోయినా అత్యధికులు ప్రతికూలంగా మారుతున్నారు. గత ఎన్నికలలోతన
విజయానికి కర్త, కర్మ, క్రియగా స్వయంగా జగనే చెప్పిన ఎన్నికల వ్యూహకర్త
ప్రశాంత్ కిషోర్ కూడా ప్రత్యర్థి శిబిరంతో చేతులు కలిపారు. ఇప్పుడు సొంత
చెల్లి షర్మిల కూడా జగన్ కు తాను వ్యతిరేకమని లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్
పంపడం ద్వారా తేటతెల్లం చేశారు.