అమరావతి : ఏపీలో వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధించనుంది?, సీఎం ఎవరు
అవుతారు? పలు సర్వేల ఫలితాలు తెలుగుదేశం, జనసేన కూటమి విజయం సాధించి
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనీ, నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారనీ
బల్లగుద్ది మరీ చెప్తున్నాయి. అయితే ఒకటీ అరా సర్వేలు మరోసారి వైసీపీ
అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనీ, అది కూడా గతం కంటే ఎక్కువగా స్థానాలు
గెలుచుకుని మరీ అధికారంలోకి వస్తుందనీ చెప్పినా ఆ సర్వేల ఉద్దేశ్యం ఏంటి
అనేది కూడా పరిశీలకులు తేల్చేస్తున్నారు. వైసీపీకి అనుకూల సర్వేలలోకి గెలిచే
స్థానాలు చూస్తే ఇది ఎంత ఫేక్ అనేది స్పష్టంగా తెలిసిపోతుందంటున్నారు. అదే
తెలుగుదేశం, జనసేన కూటమి గెలిచే అవకాశాలున్నాయంటూ చెప్పిన పలు సర్వేలు, ఆ
సర్వేలలో తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు విజయం సాధించే స్థానాలను గమనిస్తే ఆ
సర్వేలన్నీ ప్రజల అభిప్రాయాలకు దగ్గరగా ఉంటున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు
తాజాగా పొలిటికల్ లయన్స్ క్లబ్ అనాలసిస్ సంస్థ సర్వే ఫలితం కూడా జగన్ కు ఏపీ
ప్రజలు మరో చాన్స్ ఇచ్చేది లేదని విస్పష్టంగా నిర్ణయం తీసేసుకున్నారని
తేల్చింది. ఆ సర్వేలో తెలుగుదేశం, జనసేన కూటమి అత్యధిక స్థానాలలో విజయం
సాధించడం ఖాయమని పేర్కొంది. తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభంజనంలో మంత్రులు కూడా
చిత్తుగా ఓడిపోతారని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ప్రసాద్ కందెగుల అనే అనలిస్ట్
సారథ్యంలో నడుస్తున్న పొలిటికల్ లయన్స్ క్లబ్ అనాలసిస్ సంస్థ వెల్లడించిన ఈ
ఫలితం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
ఒక్కసారి గత ఎన్నికల ఫలితాలకు వెళ్తే వైసీపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న
సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలు గాను 151 స్థానాల్లో విజయం సాధించి
వైసీపీ విజయదుందుభి మోగించింది. టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. పవన్
కళ్యాణ్ జనసేన పార్టీ అయితే ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తం పోలైన
ఓట్లలో 50 శాతం ఓట్లను వైసీపీ సొంతం చేసుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక,
సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశాక తొలి ఆరు నెలలలోనే ప్రజలలో
అసంతృప్తి మొదలైంది. అది కాస్తా నాలుగేళ్ళ కాలం తిరిగేసరికి ప్రజలలో తీవ్ర
వ్యతిరేకతగా మారింది. సంక్షేమం అమలు, అభివృద్ధిలో జగన్ ఘోరంగా విఫలమయ్యారు.
దానికి తోడు కక్షసాధింపులతో మరింత వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. తెలుగుదేశం
అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఈ వ్యతిరేకత ద్విగుణీకృతం, త్రిగుణీకృతంగా
పెరిగిపోయింది. అదే ఇప్పుడు ప్రజలు ఎన్నికలెప్పుడొచ్చినా జగన్ ను గద్దెదింపి
తీరుతాం అన్న నిర్ణయానికి వచ్చేలా చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పరిశీలకుల విశ్లేషణలకు, జనం మూడ్ కు అద్దంపట్టేలా పొలిటికల్ లయన్స్ క్లబ్
అనాలసిస్ సర్వే ఫలితం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తెలుగుదేశం, జనసేన
కూటమి రాష్ట్రంలోని 175 స్థానాలలో 141 స్థానాలలో జయకేతనం ఎగురవేస్తుందని,
వైనాట్ 175 అని చెప్పుకుంటున్న అధికార వైసీపీ మాత్రం 34 సీట్లకు మాత్రమే
పరిమితమౌతుందని సర్వే ఫలితం పేర్కొంది.
చంద్రబాబు, పవన్ రాష్ట్రంలో ఎక్కడ నుంచి పోటీ చేసినా అత్యధిక మెజార్టీ తో
విజయం సాధించడం ఖాయమని సర్వే ఫలితం కుండబద్దలు కొట్టింది. ఇక్కడ మరో విశేషం
ఏంటంటే.. ఈసారి కూడా ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం, జనసేన కూటమి, వైసీపీ వినా మరో
పార్టీకి చాన్స్ లేదని తేల్చేసింది అంటే వచ్చే ఎన్నికలలో కూడా జాతీయ పార్టీలు
బీజేపీ, కాంగ్రెస్ లు ఏపీ అసెంబ్లీలో ఖాతా తెరిచే అవకాశాలు లేవని సర్వే ఫలితం
పేర్కొంది. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందన్న విషయాన్ని కూడా సర్వే
పేర్కొంది. ఈ పొలిటికల్ లయన్స్ క్లబ్ అనాలసిస్ సర్వే ఫలితం ప్రకారం
రాయలసీమ, ఉత్తరాంధ్రలో కొంత మేర మాత్రమే వైసీపీ ప్రభావం చూపుతుంది. ఉభయ
గోదావరి జిల్లాల్లో కలిపి అధికార వైసీపీ కేవలం మూడు స్థానాలలో మాత్రమే విజయం
సాధించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన స్థానాలలో కూడా
జిల్లాకు ఒకటి రెండు సీట్లు మినహా గెలిచే అవకాశాలు ఇసుమంతైనా లేవని సర్వే
తేల్చింది. రాయలసీమ నుండి కడప, రాజంపేట, రాయచోటి, పులివెందుల, కమలాపురం,
జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు, కోడుమూరు, పాణ్యం, పత్తికొండ, ఆలూరు,
సింగనమల, చంద్రగిరి, సత్యవేడు, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు
ఉత్తరాంధ్ర నుండి కురపం, పాలకొండ, చీపురుపల్లి, వీ మాడుగుల, అరకు వ్యాలీ,
పాయకరావు పేట.. ఉభయ గోదావరి నుండి పెద్దాపురం, అనపర్తి, రంపచోడవరం కోస్తాఆంధ్ర
నుండి గోపాలపురం, గుడివాడ, పామర్రు, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, గూడూరు
స్థానాలలో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయనీ, మిగతా 141 స్థానాలలో
టీడీపీ,జనసేన కూటమి జయకేతనం ఎగురవేస్తుందని సర్వే ఫలితం తేల్చింది. ఇప్పుడీ
సర్వే ఫలితం సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.