టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ టీమిండియా విజయం సాధించింది. వర్షం కారణంగా సెకండ్ ఇన్నింగ్స్‌కు అంతరాయం కలగడంతో మ్యాచ్‌ను 16 ఓవర్లకు, టార్గెట్‌ను 151 పరుగులకు కుదించారు. బంగ్లాదేశ్ జట్టు 16 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. చివరి దాకా నువ్వానేనా అనేంత ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ గెలుపుతో టీమిండియాకు సెమీస్ అవకాశాలు మరింత చేరువయ్యాయి. బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు లిట్టన్ దాస్, షంటో శుభారంభం ఇచ్చారు. లిట్టన్ దాస్ 27 బంతుల్లో 3 సిక్సులు, 7 ఫోర్లు కొట్టి 60 పరుగులతో టీమిండియా బౌలర్లను బెంబేలెత్తించాడు. బంగ్లాదేశ్ ఏడు ఓవర్ల వద్ద బ్యాటింగ్ ఆడుతుండగా వర్షం ఆటంకం కలిగించింది. దీంతో.. డక్‌వర్త్ లూయిస్ విధానంలో ఓవర్లను, టార్గెట్‌ను కుదించారు. డక్‌వర్త్ లూయిస్ విధానంలో టీమిండియాకు ఈ విజయం దక్కింది. బంగ్లాదేశ్ జట్టు చివరి బంతి వరకూ పోరాడిన తీరు అభినందనీయమని చెప్పక తప్పదు.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచి అదరగొట్టగా, టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుస వైఫల్యాల తర్వాత ఫామ్‌లోకొచ్చి హాఫ్ సెంచరీతో రాణించాడు. సూర్యకుమార్ యాదవ్ 30 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టి టీమిండియాను విజయ తీరాలకు చేర్చిన విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఈ కీలక మ్యాచ్‌లో కూడా అద్భుత ఆటతీరును కనబర్చాడు. 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచి హాఫ్ సెంచరీతో రాణించడమే కాకుండా అప్పటివరకూ ఉన్న టీ20 వరల్డ్ కప్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్‌లో ఇన్నాళ్లూ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా శ్రీలంక క్రికెటర్ మహేలా జయవర్ధనే పేరు మీద రికార్డు ఉండేది. జయవర్ధనే 1016 పరుగులు చేసి ఈ రికార్డు సాధించాడు. తాజాగా.. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో 1017 పరుగులతో జయవర్ధనే రికార్డును కోహ్లీ తిరగరాశాడు. కోహ్లీ 1017, జయవర్ధనే 1016, క్రిస్ గేల్ 965, రోహిత్ శర్మ 921, దిల్షాన్ 897 పరుగులతో ఈ రికార్డు సాధించిన జాబితాలో నిలిచారు.