పాడా అభివృద్ధిపై పులివెందుల రూరల్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు,
అధికారులతో ఇడుపులపాయలో సమీక్షా సమావేశం
ఇడుపులపాయ : పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం
అలుపెరగకుండా శ్రమిస్తున్న పులివెందుల మండల ప్రజాప్రతినిధులు, అధికారులు,
నాయకులకు, ప్రభుత్వ ఆశయాల ఆచరణకు సంపూర్ణ సహకారం, మద్దతునిస్తున్న ప్రజలకు
ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
పేర్కొన్నారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు ఆదివారం ఉదయం
వైఎస్ఆర్ ఘాట్ వద్ద క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు ముగించుకుని ఇడుపులపాయ
ఎస్టేట్ లోనే ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
పులివెందుల రూరల్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి.. పాడా
అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముందుగా సొంత
నియోజకవర్గ ప్రజలపై ఉన్న మమకారం, స్థానిక బంధువులు, స్నేహితులు, సన్నిహితులను
ఒకేచోట కలిసిన ఆనందంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్కడకు
హాజరైన మండల నాయకులను పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. కలిసి చాలా రోజులైంది.
ఒకసారి కలిసినట్లుంటుంది, మన కష్ట సుఖాలు పంచుకోవచ్చనే ఉద్దేశ్యంతో ఈ సమావేశం
ఏర్పాటు చేయడమైనదని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీ, ప్రణాళికా
ప్రకారం అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతోందన్నారు. అందుకు
అన్ని వర్గాల ప్రజలు సమ్మతి, సహకారం ఎంతో అవసరం అన్నారు. గ్రామ లోగిళ్ళలోనే..
గ్రామ సచివాలయాల ద్వారా.. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను సంతృప్తికరంగా
ప్రజలకు అందించేందుకు నిరంతరం పాటు పడుతున్నామన్నారు. వ్యవస్థ సక్రమంగా
నడవాలంటే ఎక్కడా వివక్షకు తవివ్వకూడదనేదే మన ప్రభుత్వ సిద్ధాంతం అన్నారు.
పరిపాలన పారదర్శకంగా సాగినపుడే ప్రజా వ్యవస్థ పటిష్ఠంగా సాగుతుందనే నిజాన్ని ఈ
నాలుగున్నర సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలే గుర్తించారన్నారు. భవిష్యత్తులో కూడా
ప్రజల అవసరాలను తీర్చే పథకాలతో ప్రభుత్వంపై వారి నమ్మకాన్ని రెట్టింపు
చేసేలా.. సంతృప్తి స్థాయిలో సుపరిపాలన కొనసాగిస్తామన్నారు. నియోజకవర్గ
అభివృద్ధిలో భాగంగా అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి ఎలాంటి తావులేకుండా కుల,
మత, వర్గ, ప్రాంతాలకు అతీతంగా అత్యంత పారదర్శకంగా అలుపెరుగకుండా శ్రమిస్తున్న
వైసిపి నాయకులకు, అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
అభినందనలు తెలియజేశారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు పాడా
అభివృద్ధి పనుల పురోగతిపై.. రాష్ట్ర ముఖ్యమంత్రికి క్లుప్తంగా వివరించారు.
పులివెందుల రూరల్ మండలం గురించి మాట్లాడుతూ 7 రెవెన్యూ గ్రామాలు, 6 గ్రామ
పంచాయతీల, 5 సచివలయాలతో పులివెందుల రూరల్ మండలంలో గ్రామ పరిపాలన సంతృప్తికరంగా
సాగుతోందన్నారు. రూరల్ మండలంలో పిబిసి, సీబీఆర్ మైనర్, మైక్రో ఇరిగేషన్
ఆయకట్టు పరిధిలో దాదాపు 14 వేల ఎకరాలు పైగా వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగులోకి
తీసుకురావడం జరుగుతోందన్నారు. అనంతరం పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి
మాట్లాడుతూ పులివెందుల రూరల్ మండలం పరిధిలో పాడా, ఇతర శాఖల సమన్వయంతో
జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా
క్షుణ్ణంగా వివరించారు. ఇప్పటివరకు పాడా అభివృద్ధి క్రింద రూ.44.40 కోట్ల మేర
మంజూరు చేసి వివిధ అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని, ఇప్పటి వరకు రూ.31.08
కోట్లు వెచ్చించి పలు పనులు పూర్తి చేయడం జరిగిందని.. ఇంకొన్ని పనులు
పురోగతిలో ఉన్నాయన్నారు. మైక్రో ఇరిగేషన్, ఆర్ అండ్ బి, బిటి, విద్యుత్ శాఖ,
ఉపాధిహామీ, నాడు-నేడు వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో రూ.135.49 కోట్లతో
చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి రూ.58.85 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని,
మిగతా పనులు వేగవంతంగా పురోగతిలో ఉన్నాయని ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం
పలువురు నాయకులు మండలంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రికి
సలహాలు ఇవ్వగా పలువురు నాయకులు పలు ప్రతిపాదనలతో ముఖ్యమంత్రికి వినతి పత్రాలను
అందివ్వడంతో పాటు, నేరుగా ముఖ్యమంత్రికి విన్నవించారు. జగనన్నకు చెబుదాం
కార్యక్రమం ద్వారా ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని సమస్యలన్నీ
పరిష్కారం అయ్యాయని పలువురు సంతోషం వ్యక్తం చేశారు. సీబీఆర్ – ఎర్రబెల్లి
నూతన పైప్ లైన్ పరిధిలోని మోతున్నూతన పల్లెలో స్టోరేజీ పాయింట్ ఏర్పాటు
చేస్తే.. వేలాది ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుందని స్థానిక ప్రజలు
కోరారు. అలాగే మోతున్నూతన పల్లెలోని గవేశరస్వామి ఆలయంను మీరు ఎంతో అభివృద్ధి
చేశారని.. చుట్టూ కొండ ప్రాంతంలో పర్యాటక ప్రాంతంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి
చేయలని కోరారు. ఎర్రబల్లె చెరువు నుండి పంపింగ్ ద్వారా చిన్న గుంతలకు నీటి
సరఫరా చేస్తే.. వ్యవసాయ అవసరాలు తీరుతాయని మరి కొందరు గ్రామస్తులు
విన్నవించారు.
నుర్బాష, దూదేకుల సంఘం నాయకులు మహ్మద్ రఫీ మాట్లాడుతూ షాదీతోఫాను, కళ్యాణమస్తు
ఆర్థిక సాయాన్ని పెంచి దూదేకుల కుటుంబాలకు ఎంతో ఆర్థిక చేయుతనివ్వడం
సంతోషించదగ్గ విషయం అన్నారు. తాంజ్ ముస్లిం మతాన్ని ఆచరిస్తున్నందున
సర్టిఫికెట్ల జారీలో నుర్బాషలను ముస్లింలు గా గుర్తించాలని కోరారు. పలువురు
మండల నాయకులు మాట్లాడుతూ మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి..
పులివెందుల మండలం పచ్చదనంతో కలకళలాడుతోందన్నారు. ఇదంతా మీరు ఇరిగేషన్
ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడంతోనే సాధ్యమైందని ప్రశంసిస్తూ ముఖ్యమంత్రికి
కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ రిజర్వాయర్ల పరిసర ప్రాంత
గ్రామాల్లో గ్రామస్థులకు, రైతులకు ఏవైనా సమస్యలను పూర్తి వివరాలతో అందజేస్తే
సంబందిత అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని
ముఖ్యమంత్రి తెలియజేస్తూ అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి
సమీక్ష సమావేశాన్ని ముగించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు
సురేష్, కడప ఎంపి అవినాష్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ధనుంజయ రెడ్డి,
ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జేసీ గణేష్
కుమార్, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఫుడ్
ప్రాసెసింగ్ సలహా కమిటీ మెంబర్ బలరామిరెడ్డి, మండలధ్యక్షులు, ఎంపిటిసిలు
ఖాదరబాధర వరలక్ష్మి, కొమ్మా వరలక్ష్మి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్
సర్వోత్తం రెడ్డి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.