విజయవాడ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సాధారణ మెజారిటీ
రావడంతో ఆంధ్రప్రదేశ్‌లో పగటి కలలు కనడానికి హస్త పార్టీ నేతలకు తెలుగుదేశం
నేతలు తోడయ్యారని రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి
విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ
ఏర్పాటు చేశాక ప్రస్తుత ఏపీలో తాను నామరూపాలు లేకుండా పోయినా ఫరవాలేదని
2013–14 మధ్య కాలంలో కాంగ్రెస్ భావించిందన్నారు. ఈ జాతీయపక్షం అంచనాలకు
అనుగుణంగానే గడచిన పది సంవత్సరాల్లో ఏపీలో జరిగిన రెండు జోడు ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీకి కనీసం 3 శాతం ఓట్లు రాలేదన్నారు. తెలంగాణ ఇచ్చిన సమయంలో
జరిగిన 2014 పార్లమెంటు ఎన్నికల్లో ఏపీలోని మొత్తం 25 లోక్ సభ
నియోజకవర్గాల్లో ఈ పార్టీకి 2.8 శాతం ఓట్లు మాత్రమే దక్కాయని గుర్తు చెశారు.
ఒక్క సీటూ దక్కలేదు. తాను ఇచ్చానని చెప్పుకునే తెలంగాణ రాష్ట్రంలో నూతన
రాష్ట్రావతరణ తర్వాత కాంగ్రెస్ పదేళ్లూ ప్రతిపక్ష స్థానానికే పరిమితమైంది.
కిందటి నవంబర్ నెలలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 39.40 శాతం ఓట్లతో
మొత్తం 119 సీట్లకు గాను సాధారణ మెజారిటీకి అవసరమైన 64 స్థానాలు కాంగ్రెస్
సంపాదించిందన్నారు. తెలంగాణలో పదేళ్లుగా ఒక ప్రాంతీయపక్షం పాలన సాగిన
నేపథ్యంలో తాము సాధించిన విజయంతో వచ్చే ఏడాది ఏప్రిల్–మే మాసాల్లో
పార్లమెంటుతోపాటు జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తమ పరిస్థితి కాస్త
మెరుగవుతుందని, నాలుగున్నర సంవత్సరాలకు పైగా ప్రతిపక్ష పార్టీ హోదాలో
కునారిల్లుతున్న తెలుగుదేశం పార్టీకి అది తోడ్పడుతుందని కాంగ్రెస్ నేతలు పగటి
కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. 2019 వేసవి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా
పోటీచేసిన కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్లు కేవలం 1.17 శాతం. అంటే, మరో
జాతీయపక్షం బీజేపీకి పడిన ఓట్ల శాతం (0.84%) కన్నా కాస్త ఎక్కువ. మరి, ఈ ఐదు
సంవత్సరాల్లో ఏపీలో కాంగ్రెస్ చేసిందేమీ లేదు. జనం మధ్య తిరిగిందీ లేదు.
అయినాగాని, 2024 ఎన్నికల్లో ఎక్కడైతే పాలకపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ కాస్త
బలహీనపడుతుందో అలాంటి చోట్ల తాము కాస్త ఎక్కువ ఓట్లు సంపాదించి ఒక్క సీటూ
గెలవకపోయినా ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులకు మేలు చేసే స్థితికి ఎదుగుతామని ఏపీ
రాష్ట్ర కాంగ్రెస్ కలలు కంటున్నారని చెప్పారు.
కాంగ్రెస్‌కు పడే ఓట్లు కొద్దిగా పెరిగినా తమకే లాభమని టీడీపీ పగటి కలలు.
2014 ఆరంభంలో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో
ఆంధ్రప్రదేశ్‌లోని 25 పార్లమెంట్లు స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి
45.7 శాతం ఓట్లు, 8 సీట్లు వచ్చాయన్నారు. కాంగ్రెస్ 2,8 % ఓట్లతో
సరిపెట్టుకుంది. అడ్డగోలు విభజనతో తమకు ద్రోహ చేసిన కాంగ్రెస్ పార్టీకి
ఆంధ్రా జనం రెండు ఎన్నికల్లో అసెంబ్లీ సీటుగాని, పార్లమెంటు సీటుగాని ఒక్కటి
కూడా ఇవ్వలేదు. అయినా, పక్క తెలుగు రాష్ట్రంలో బొటాబొటి మెజారిటీతో తమకు
లభించిన అధికారాన్ని చూసుకుని ఏపీ కాంగ్రెస్ నాయకులు– ఇక వచ్చే ఏడాది
ఎన్నికల్లో ఆంధ్రా ఓటర్లు తమను కొద్దిగా కరుణించిన వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీకి నష్టం కలిగించి టీడీపీకి ప్రయోజనం చేకూర్చవచ్చనే భ్రమల్లో
బతుకుతున్నారు. అంటే ఒకరకంగా తెలుగుదేశం నేతలూ, కాంగ్రెస్ నాయకులూ, ఒక వర్గం
మీడియా ఈ రకంగా పగలూ రాత్రీ కలలు కంటూ కాలక్షేపం చేస్తున్నారని చెప్పారు.
తొలిసారి 2019 మేలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతగా
ఆంధ్రా ప్రజలకు దగ్గరైనదీ ఈ రెండు పార్టీల నేతలకు తెలియనిది కాదు. అయినా, తమ
కేడర్‌ను, చోటామోటా నాయకులను ఎన్నికల్లో దింపి పని చేయించడానికి ఈ రెండు
పార్టీల నాయకులు, వారికి అనుకూలంగా వండి వార్చే పత్రికలు, టీవీ చానళ్ల
వ్యాఖ్యాతలుఇలాంటి ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
పశ్చిమ బెంగాల్ లో జరిగిందే ఆంధ్రాలో రిపీటవుతుంది.
ఒక్కసారి పశ్చిమ బెంగాల్ 12 సంవత్సరాల ఎన్నికల రాజకీయాలను పరిశీలిస్తే–వచ్చే
ఏడాది ఏపీ శాసనసభ ఎన్నికల్లో ఏం జరిగేదీ అర్ధమౌతుందన్నారు. ఏపీలో వైఎస్సార్
కాంగ్రెస్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీతో పూర్వ సంబంధం ఉన్న పశ్చిమ బెంగాల్
పాలకపక్షం ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్. ఈ పార్టీ 2011లో నాటి పాలక సీపీఎం
నాయకత్వంలోని వామపక్ష ఫ్రంట్ ను ఓడించింది. ఆ తర్వాత వరుసగా 2016, 2021
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయక్వంలోని తృణమూల్
ప్రభుత్వం తిరుగలేని ఘన విజయాలు సాధించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్
ఫ్రంట్ అండతో పోటీచేసినాగాని కాంగ్రెస్ ఏపీలో మాదిరిగానే ఒక్క సీటూ
గెలుచుకోలేకపోయింది. కేవలం 2.93% ఓట్లతో కాంగ్రెస్ చతికిలబడింది. 1977లో ఈ
తూర్పు తీర రాష్ట్రంలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి తృణమూల్
కాంగ్రెస్ పుట్టిన 23 ఏళ్లకు అసెంబ్లీలో అసలు ఉనికినే కోల్పోయింది. రేపు
ఆంధ్రప్రదేశ్‌లో జరిగేది కూడా ఇదేన్నారు. వైఎస్సీర్సీపీ అవతరించిన మూడేళ్లకే
ఏపీ శాసనసభలో కాంగ్రెస్ బలం జీరో అయింది (2014లో). బంగాళాఖాతం తీరాన ఉన్న 4
రాష్ట్రాల్లో (పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీ, తమిళనాడు) కాంగ్రెస్ ఎన్నిటికీ
అధికారంలోకి రాలేదనే వాస్తవాన్ని ఇప్పటికైనా గుర్తిస్తే మంచిదన్నారు. అలాగే
ఏపీలో రేపు కాంగ్రెస్ చీల్చే ఒకట్రెండు శాతం ఓట్ల ఆసరాతో తమకు మెజారిటీ
వస్తుందనే పగటి కలలకు టీడీపీ నేతలు స్వస్తి పలికితే కనీసం పది పరకా సీట్లయినా
దక్కించుకునే వీలుంటుందని విజయసాయిరెడ్డి అన్నారు.