అమరావతి : మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏపీలోనూ ప్రారంభానికి రంగం
సిద్ధమవుతోంది. తొలుత కర్ణాటకలో ఈ పథకం ప్రారంభించారు. తెలంగాణలోనూ కాంగ్రెస్
ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తోంది. టీడీపీ
దీనిని తమ ఎన్నికల గ్యారంటీల్లో చేర్చింది. ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వం
రాష్ట్రంలో అమలు పైన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. అన్నీ పరిగణలోకి
తీసుకుని సంక్రాంతి నుంచి అమలు చేసేలా నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
ఉచిత బస్పు ప్రయాణం : మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పై మంచి స్పందన
కనిపిస్తోంది. కర్ణాటక, తెలగాణలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ప్రాధాన్యత
ఇస్తున్నారు. దీంతో, ఏపీలోనూ మహిళల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణం పైన చర్చ
మొదలైంది. ఏపీలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. సీఎం జగన్ తాను
అమలు చేస్తున్న సంక్షేమం తనకు తిరిగి అధికారం నిలబెడుతుందనే నమ్మకంతో ఉన్నారు.
టీడీపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని
ప్రకటించింది. మహిళల్లో స్పందన కనిపిస్తున్న ఈ పథకం పైన ఇప్పుడు ఏపీ ప్రభుత్వం
ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో
విలీనం చేసారు.
అధికారుల కసరత్తు : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పైన
ప్రస్తుతం సాధ్యాసాధ్యాలపైన ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నారు. దీని పైన
ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ పథకం అమలు దిశగా ప్రభుత్వం అడుగులు
వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సంక్రాంతి పండుగ నుంచి అమలు చేయాలని
భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పొరుగు రాష్ట్రాల్లో ఈ పథకం ఎలా అమలు చేస్తున్నారు..ఏ మేర భారం పడుతుందనే
అంశాల పైన అధికారులు నివేదికలు సిద్దం చేస్తున్నారు. దీని ద్వారా ఆర్టీసీకి
రాబడి ఎంత తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏ మేర భర్తీ చేయాల్సి ఉంటుందనే అంశాల
పైన కసరత్తు కొనసాగుతోంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సగటున 40 లక్షల
మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 15 లక్షల మంది వరకు మహిళలు ఉంటారని అంచనా.
సంక్రాంతి నుంచి అమలు : అన్ని రకాల పాస్ లు కలిగిన వారు 10 లక్షల మంది ఉంటారు.
ఇందులో 3-4 లక్షల మంది విద్యార్ధినులు, మహిళలు ఉంటారు. ప్రస్తుతం నిత్యం
ప్రయాణించే వారి ద్వారా ఆర్టీసీకి సగటున రూ 17 కోట్ల వరకు రాబడి వస్తోంది.ఒక
వేళ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తే నిత్యం రూ 6 కోట్ల వరకు ఆదాయం
తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వివరాలన్నీ నివేదిక రూపంలో సిద్దం
చేస్తున్నారు. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ముందుగానే అమలు చేయాలనే ఆలోచనలో
ప్రభుత్వంలోని ముఖ్యులు ఉన్నట్లు చెబుతున్నారు. దీని పైన త్వరలోనే ప్రభుత్వం
అధికారికంగా తమ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఇది అమల్లోకి వస్తే ఏపీలో
మహిళలకు కర్ణాటక, తెలంగాణ తరహాలోనే బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం
దక్కుతుంది.
[image: image.png]