సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం
విజయవంతం చేద్దాం పోసాని కృష్ణ మురళి పిలుపు
గుంటూరు : నాటక రంగానికి పుట్టిల్లు వంటి గుంటూరు నగరం 22వ ‘నంది
నాటకోత్సవాలకు’ ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ఇందుకోసం ప్రభుత్వం పక్షంగా అన్ని
ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తేదీ 23 శనివారం ఉదయం 9గం కీ.శే. బలిజేపల్లి
లక్ష్మి కాంతం కళా ప్రాంగణంలో (శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం) లో మంత్రులు,
శాసన సభ్యుల సమక్షంలో జరిగే శుభారంభం సభతో ఇవి మొదలు కానున్నాయి. ఈ పోటీల్లో
73 అవార్డులు గెలుచుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 38 నాటక సమాజాల నుంచి 1200
మంది కళాకారులు పాల్గొంటున్నారు.
నటుల బస ఎసి గదుల్లో : వీరి నాటక ప్రదర్శనలు పరిశీలించి వాటికి స్వర్ణ,
రజిత,కాంస్య నందుల విజేతలను ఎంపిక చేయడానికి 15 మంది న్యాయ నిర్ణేతలు
హాజరవుతున్నారు. సంస్థ తరపున నటులు, జడ్జీల ఆతిథ్యం కోసం రెండు కమిటీలు
పనిచేస్తున్నాయి. మొదటిసారి నటీనటులకు ఏ.సి. హోటల్ గదుల్లో బస ఏర్పాటుచేశారు.
వీరికి టి.టి.డి. కల్యాణ మండపంలో ‘మెస్’ ఏర్పాటు చేస్తున్నారు. ఆడిటోరియం వద్ద
శానిటేషన్, మెడికల్ ఎమర్జెన్సీ డెస్క్, ఫైర్ సర్వీస్, అంతరాయం లేకుండా
విద్యుత్తు సప్లై, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ బందోబస్తు, ట్రాఫిక్
రెగ్యులేషన్ చేస్తున్నది. నటులు బస చేసే చోట ముందస్తు జాగ్రత్త కోసం
వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అంబులెన్స్ సర్వీస్
ఏర్పాటుచేస్తున్నది.
ప్రత్యేక లైటింగ్, సౌండ్ : థియేటర్ స్టేజి పైన ప్రత్యేక లైటింగ్, సౌండ్
ఏర్పాటు కోసం ‘సురభి’ వారిచేత ఏర్పాట్లు చేయించారు. ప్రతి రోజు ఉదయం 9.30
నుంచి రాత్రి 10 గం. వరకు రోజుకు ఐదు విభాగాల్లో 5 ప్రదర్శనలు ఉంటాయి. ప్రవేశం
ఉచితం. ప్రేక్షకుల సౌకర్యం కోసం ఆడిటోరియం ఆవరణలో పరిమితంగా ‘ఫుడ్ కోర్ట్స్’
ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు.
రిసెప్షన్ : ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టి.వి. థియేటర్ డెవలప్మెంట్
కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ సెక్రటరీ సమాచార పౌరసంబంధాల శాఖ టి. విజయ్
కుమార్ రెడ్డి మాట్లాడుతూ “మా ఆహ్వాన కమిటీ సభ్యులు రైల్వే స్టేషన్ కు వెళ్లి
వారిని పూలమాల శాలువాతో ‘రిసీవ్’ చేసుకుని మా వాహనాల్లో వారికి ఏర్పాటుచేసిన
హోటల్ గదికి తీసుకువస్తారు. వారు ఆడిటోరియంకు వచ్చే సమయానికి మా వాహనాల్లో
రవాణా కమిటీ సభ్యులు వారి వద్దకు వెళ్లి వారిని ప్రదర్శన కోసం తీసుకువస్తారు.
వారి ప్రదర్శనల సమయం మేరకు వారికి తిరిగి హోటల్ కు రవాణా అందుబాటులో ఉంటుంది.
ప్రదర్శన అనంతరం వారి తిరుగు ప్రయాణం సమయానికి వారికి రైల్వే స్టేషన్ కు మా
వాహనాలలో ‘డ్రాపింగ్’ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాము. ఇలా వారికి ‘రిసెప్షన్’
విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము” అన్నారు.
మీడియా కోసం : ప్రధాన మీడియాతో పాటు ఈ సారి ‘సోషల్ మీడియా’ కు కూడా సమాచారం
ఇవ్వడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు
జరిగే నాటక ప్రదర్శనల ‘రౌండ్ అప్ క్యాప్సూల్ ‘ అదే రోజు సాయంత్రం మీడియాకు
విడుదల చేసే విధంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. నాటకాల ప్రదర్శన తర్వాత
వాటిపై సమీక్షలు కధా సంగ్రహం కూడా మీడియాకు విడుదల చేస్తున్నారు. నటులు,
సమాజాల నిర్వాహకులు మీడియాతో మాట్లాడడానికి వీలుగా ఆడిటోరియం వద్ద మీడియా
పాయింట్ ఏర్పాటు చేస్తున్నారు.
‘ఎన్టీఆర్ & డా. వైఎస్సార్ రంగస్థల పురస్కారం’ : ప్రభుత్వం 1998 నుండి ఏటా
నంది నాటకోత్సవాలు నిర్వహిస్తూ అదే వేదికపై వ్యక్తిగత స్థాయిలో నాటక రంగంలో
విశేష కృషి చేసిన నటీనటులకు లక్ష యాభై వేలు నగదు పురస్కారంతో- ‘ఎన్టీఆర్
రంగస్థల పురస్కారం’ పేరుతో అవార్డు ప్రదానం చేస్తున్నది. కాగా ఇప్పుడు
మొదటిసారి ఈ ఏడాది నుంచి ఈ రంగంలో సమిష్టి కృషితో (టీమ్ వర్క్) పనిచేసిన
సమాజాలకు, పరిషత్తులకు ఈ కొత్త ‘వైఎస్సాఆర్’ అవార్డుతో గుర్తింపు లభించనుంది.
నాటక రంగంపై ఆసక్తిగల కళాప్రియులకు వేదిక కల్పించి, ఆ రంగం వృద్ధికి గణనీయమైన
కృషి చేసిన సమాజాలు, పరిషత్తులకు రూ. 5,00,000 నగదు, ‘వైఎస్సాఆర్’ ప్రతిమ
మొమెంటోతో సత్కరిస్తూ అరుదైన గౌరవం నాటక సమాజాలకు ప్రభుత్వం కల్పించబోతున్నది.
మరో తరం కోసం : ‘నంది నాటకోత్సవాల’లో కొంత కాలంగా కాలేజీ – యూనివర్సిటీ స్థాయి
విద్యార్థులకు పోటీల విభాగం ఉంటున్నది. యువతరంలో నాటకరంగ రంగం పట్ల ఆసక్తి
కలిగించడానికి పెద్దఎత్తున కాలేజి, యూనివర్సిటీ విద్యార్థులను ఈ నాటకోత్సవాలలో
భాగస్వామ్యులను చేయాలని సంస్థ నిర్ణయించింది. అందులో భాగంగా గుంటూరులో
జరగనున్న ఈ ప్రదర్శనల్లో నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం, థియేటర్ ఆర్ట్స్
శాఖల విదార్థులు నాటక సమాజాలు, ప్రేక్షకుల నుంచి ‘ఫీడ్ బ్యాక్’
సేకరించనున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 1.30 వరకు జరిగే బాలల నాటికల ప్రదర్శనలు
చూడడానికి నగరంలోని పాఠశాల విదార్థుల్ని ఆయా యాజమాన్యాలు పంపుతున్నాయి.
రెండు సి.డి.లు విడుదల : రాష్ట్ర విభజన తర్వాత తెలుగు నాటక రంగంలో మన
వైతాళికుల ప్రాభవాన్ని వెల్లడిస్తునే, దాన్ని తదుపరి తరాల కోసం
‘డాక్యుమెంటేషన్’ చేయాలనే లక్ష్యంతో ఈ సంస్థ ఒక ‘ప్రాజెక్టు’ను చేపట్టింది.
‘ఎందరో మహానుభావులు…’ పేరుతో 75 మంది తెలుగు నాటక దీపధారుల సంక్షిప్త జీవిత
చిత్రణతో సి.డి.లు విడుదల చేస్తూ, దాని మొదటి భాగాన్ని ఈ రోజు విడుదల
చేస్తున్నారు. అలాగే, ‘రంగ ప్రస్థానం’ పేరుతో ప్రపంచ నాటక రంగ చరిత్రను
సంక్షిప్తంగా రికార్డు చేసిన మరో సి.డి.ని విడుదల చేస్తున్నారు. ఇక ముందు ఈ
రెండు ‘పబ్లిక్ డొమెయిన్’లో ఉంటాయి. ఆదరణ తగ్గుతున్న ఈ రంగానికి ప్రభుత్వం
నుంచి కొత్తగా లభిస్తున్న ఇటువంటి ప్రోత్సాహం వల్ల, మళ్ళీ దీనికి పూర్వ వైభవం
లభించాలనే కళాభిలాషుల ఆకాంక్ష నెరవేరనుంది. ఇటువంటి ప్రభుత్వం చొరవ వల్ల నాటక
రంగంలోకి కొత్తగా యువతరం ప్రవేశించే అవకాశం ఎంతైనా ఉంది.
శనివారం జరిగే నాటక ప్రదర్శనలు : ఉదయం 11 గం. ‘శ్రీ కాళహస్తీశ్వర మహత్యం’
(పద్య నాటకం) మధ్యాహ్నం 2. 30. గం ‘ఎర్ర కలువ’ సాయంత్రం 5 గం ‘నాన్నా…
నేనొచ్చేస్తా…’ 6 .30 శ్రీ రామ భక్త తులసీ దాసు (పద్య నాటకం).
[image: image.png]