విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్లు ఆర్బీఐ
నివేదిక చెప్పిందని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయకుమార్ అన్నారు.
అప్పులు తీసుకోవడంలో రాష్ట్రం మన దేశంలోనే టాప్-3లో ఉన్నట్లు ఆయన తెలిపారు.
విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయకుమార్ మాట్లాడారు. 2023-24
ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలు కలిసి ఆర్బీఐ ద్వారా చేసిన రుణాలు 88.4
శాతమైతే ఏపీ ఒక్కటే 11.6శాతం అప్పులు చేసిందని ఆయన పేర్కొన్నారు. విద్యారంగంలో
టీడీపీ హయాం కంటే వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఖర్చుపెట్టేది తక్కువ.
బడ్జెట్లో విద్యారంగం అభివృద్ధికి ఖర్చు చేసింది 11.7 శాతమే. ఈ కేటాయింపుల్లో
ఏపీ 24వ స్థానంలో ఉంది. మరోవైపు ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులకు నిధులు ఇవ్వడం
లేదు. వైద్య రంగంలో మూడేళ్లుగా బడ్జెట్లో 5.6 శాతం మాత్రమే ఖర్చు పెట్టారు.
వైద్య రంగంలో ఎక్కువ బడ్జెట్ ఖర్చు చేసే రాష్ట్రాల్లో ఏపీ 18వ స్థానంలో ఉందని
విజయకుమార్ తెలిపారు. మౌలిక వసతులకు గతేడాది పెట్టిన ఖర్చు రూ.16వేల
కోట్లేనని చెప్పిన ఆయన.. కేటాయింపుల్లో 15వ స్థానంలో ఉన్నట్లు గుర్తు చేశారు.
రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 33.5 శాతం కాగా రాష్ట్ర ఆదాయంలో 13.9శాతం
వడ్డీకే సరిపోతోందని ఆయన వివరించారు.