అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలం దర్గాహోన్నూరు గ్రామ సమీపంలో బుధవారం జరిగిన విద్యుత్ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మొక్కజొన్న పొలంలో పంట కోస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అనధికార సమాచారం మేరకు ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మీ, శంకరమ్మ, సరోజమ్మ, వడ్రక్క అనే మహిళలు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. ప్రమాద వివరాలు తెలిసిన వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై విచారణ జరిపేందుకు విద్యుత్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లారు.
మృతుల కుటుంబాలకు రూ. పది లక్షల ఎక్స్ గ్రేషియా ..
విద్యుత్ తీగలు తెగి పడి నలుగురు మృతి చెందడం , ముగ్గురు తీవ్రంగా గాయపడి బళ్లారి ఆసుపత్రిలో చేరడం చాలా బాధాకరమని రాయదుర్గం శాసనసభ్యుడు కాపు రామచంద్రా రెడ్డి పేర్కొన్నారు. ఈ సంఘటన తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళగా ఆయన కూడా దిగ్భ్రాంతిన వ్యక్తం చేశారన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారన్నారు.
మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారన్నారు.
బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, వారు ధైర్యంగా ఉండాలని, మృతుల ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామన్నారు..