వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ సీనియర్
నేతలు,టీడీపీ క్రిస్టియన్ విభాగ నేతలు
కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
నాయుడు
ప్రస్తుత ప్రభుత్వం క్రైస్తవ సంఘాలను, సంస్థలను ఇబ్బంది పెడుతుందన్న పలువురు
మత పెద్దలు
మళ్లీ రాష్ట్రానికి మంచి జరిగేలా చంద్రబాబును దేవుడు అనుగ్రహిస్తారని దీవెనలు
విజయవాడ : తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం రాత్రి సెమీ
క్రిస్మస్ వేడుకలు జరిగాయి. సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు మాట్లాడుతూ
మానవ ప్రయత్నానికి దేవుని అశీస్సులు కావాలి. అప్పుడే సంకల్పం నెరవేరుతుంది. ఈ
రోజు పవిత్రమైన మేరీమాత దేవాలయానికి వెళ్లడం నా అదృష్టంగా
భావిస్తున్నానన్నారు. సమస్త మానవాళి రక్షణ కోసం దేవుడు ఏసు మానవ రూపంలో
వచ్చారు. ప్రభుత్వం తరుపున సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని ప్రభుత్వం
నిర్వహించే విధానాన్ని ఉమ్మడి రాష్ట్రంలో నేను మొదలు పెట్టాను. నేను సిఎంగా
ఉన్న సమయంలో మొదటి సారి సెమీ క్రిస్మస్ విధానాన్ని తీసుకువచ్చాను.నేను ఈ రోజు
మేరీమాత దేవాలయంలో బైబిల్ చదివాను. ఏ వ్యాఖ్య చూసినా సమాజ హితం కోసమే బోధనలు
ఉన్నాయి. శత్రువును కూడా ప్రేమించాలి అని బైబిల్ చెపుతోంది. కానీ మిత్రుడిని
కూడా శత్రువుగా చూసే పరిస్థితి నేడు ఉంది. క్రిస్టియానిటీకి అంటేనే సేవ.
స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు పెట్టి క్రిస్టియన్ మిషనరీలు సేవ
చేస్తున్నాయి. గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ లో అన్న ఎన్టీఆర్
చదువుకున్నారు. ప్రభుత్వాలు చేయలేని పనులు ఎయిడెడ్ పనులు సంస్థలు చేశాయి.
ఎయిడెడ్ సంస్థలకు గత ప్రభుత్వాలు గ్రాంట్ ఇచ్చి ప్రోత్సహించాయి. కానీ నేడు ఆ
ఆస్తులుకొట్టేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఏడు లక్షల కోట్ల ఎయిడెడ్ ఆస్తుల
కోసం కొట్టేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఇది తప్పు అని చెపితే వారిపై కేసులు
పెడుతున్నారు. గుంటూరు నగరం అనగానే శంకర్ విలాస్ హోటల్ గుర్తు వస్తుంది.
రంగనాయకమ్మ అనే ఆమె ఆ హోటల్ పెట్టింది. ఆమె ఎల్ జి పాలిమర్స్ ప్రమాదంపై చిన్న
ట్వీట్ పెట్టింది. తన అభిప్రాయం చెప్పినందుకు వృద్దురాలు అయిన ఆమెపై కేసు
పెట్టారు. ఆమెను బెదిరించారు. అనేక తప్పుడు కేసులు పెట్టి హోటల్ మూయించారు.
దీంతో ఆమె వేరే బిజినెస్ మొదలు పెడితే దాన్ని కూడా అడ్డుకున్నారు. దీంతో ఆమె
ఇక్కడ బతకలేం అని హైదరాబాద్ వెళ్లిపోయింది. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు బాధ
కలుగుతుంది. ప్రజలంతా వీటి గురించి ఆలోచించాలి. సెమీ క్రిస్మస్ లాంటి
కార్యక్రమం చేసుకోవడమే కాదు. ఇలాంటి అంశాల గురించి మనం మాట్లాడాలి. ఖండించాలి.
పార్టీలు దేవాలయంలా భావించే పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. దీనిపై కేసు
పెడితే కనీసం స్పందించలేదు. రాష్ట్రంలో గంజాయి విపరీతంగా ఉందని
ప్రశ్నించినందుకు వచ్చి టీడీపీ పార్టీ ఆఫీస్ పై దాడి చేశారన్నారు. రాజకీయ
పార్టీలపైనే ఇలాంటి దాడులు చేస్తే ప్రజా సమస్యలపై ఎవరు మాట్లాడుతారు.
రాష్ట్రంలో వ్యవస్థలు అన్నీ భ్రష్టు పట్టాయి. రోడ్లు ఎలా ఉన్నాయో మనం చూస్తూనే
ఉన్నాం. సమాజ హితం కోసం పనిచేయమని ఏసుప్రభువు కూడా చెప్పారు. ఎన్నికలకు ఇంకా
100 రోజులు మాత్రమే ఉంది. ప్రజలు అంతా ఆలోచించాలి. మనం గళం ఎత్తకపోతే శంకర్
విలాస్ రంగనాయకమ్మ లా అయిపోతాం. రంగానాయకమ్మ అని పేరు ఉన్నందుకు ఆమె పేరు లో
కూడా కులం చూశారు. నేను ఎప్పుడూ కులం, మతం అనేది చూడలేదన్నారు.
హైదరాబాద్ లో ఐటీని అభివృద్ది చేస్తే ఒక్క కులమే అభివృద్ది చెందిందా? నేను
ఒక్క కులం కోసం అభివృద్ది చేశానా? హైదరాబాద్ లో నేను మొదలు పెట్టిన
అభివృద్దిని నాటి వైఎస్ఆర్ నుంచి నేటి రేవంత్ వరకు కొనసాగించారు. కానీ మన
ఎపిలో మాత్రం అమరావతిని నాశనం చేశారు. మూడు రాజధానులు అంటూ విధ్వంసం చేశారు.
గుంటూరు చర్చికి నేను పది కోట్లు ఇస్తే దాన్ని పూర్తి చెయ్యలేదు. కానీ విశాఖలో
500 కోట్లతో ప్యాలెస్ కట్టి నేను పేదల బిడ్డను అంటున్నాడు. అన్నీ చేసి పైన
దేవుడు ఉన్నాడు. కింద నేను ఉన్నాను. మీ బిడ్డను అంటున్నాడు. ఎవరూ దేశంలో,
లోకంలో శాశ్వతంగా ఉండరు. కానీ సమాజం శాశ్వతం. సమాజం కోసం
పనిచేయాలి.క్రైస్తవులు జెరూసలేంకు వెళ్లేందుకు రూ. 50 వేల ఆర్థిక సాయం చేసిన
ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. గుంటూరులో రెండు ఎకరాల్లో క్రిస్టియన్ భవనం
నిర్మాణానికి రూ. 10 కోట్లు ఇచ్చాం. మరో 6 కోట్లు కూడా కేటాయించాం. విజయవాడ
చర్చికి 1.5 కోట్లు ఇచ్చాం.శ్మశాన వాటికలకు భూమి కావాలి అంటే ప్రత్యేక భూసేకరణ
కార్యక్రమం చేపట్టాం. క్రిస్మస్ రోజు పేదలు కూడా పండుగ చేసుకోవాలి అని
క్రిస్మస్ కానుకలు ఇచ్చాం. చర్చ్ ల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం చేశాం.
దేశంలో పేదరికం లేని సమాజం చూడాలనేది నా ఆకాంక్ష. దాని కోసమే నేను
పనిచేస్తాం. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాము. గతంలో టీడీపీ హయాంలో
తీసుకువచ్చిన ఈ విధానాన్ని కొనసాగించాలి.జెరూసలేం వెళ్లే వారికి 50 శాతం ఖర్చు
ప్రభుత్వాలు భరించాలి అని కోరుతున్నారు. దీన్ని అధికారంలోకి వచ్చాక పరిశీలించి
నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రానికి మంచి జరగాలని చర్చిల్లో ప్రార్థనలు చేయాలని
కోరారు.