ఏలూరు : ఏలూరు లో జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి
వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు రాష్ట్ర హోం మరియు విపత్తుల
నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉమ్మడి
పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్
ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే,
మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని)తో కలిసి పలు సేవా
కార్యక్రమాలను ప్రారంభించారు. భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. సీఎం
జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఉచిత మెగా
వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలను హోంమంత్రి తానేటి వనిత ప్రారంభించారు.
కామినేని హస్పటల్స్, రెడ్ క్రాస్ సొసైటీ, ఏలూరు వారి సౌజన్యముతో ఈ శిబిరాలను
నిర్వహించారు. ECG,బ్లడ్ షుగర్, బి.పి. తదితర పరీక్షలు నిర్వహించి ఉచితంగా
మందులను అందజేశారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. గత నాలుగున్నర ఏళ్ళలో
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం పథకాలు అందించారని తెలిపారు. డాక్టర్
బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే దిశగా పాలన సాగించారన్నారు. ఈ వేదికపై
రాజ్యాధికారం పొందిన మహిళలుగా ఇంతమంది మీ ముందు ఉండటానికి కారణం సీఎం జగన్
మోహన్ రెడ్డి అని తెలిపారు. రాజ్యాధికారం అంశంలోరాష్ట్రంలో మహిళలకు పెద్దపీట
వేసిన ఏకైక నాయకుడు జగనన్న అని కొనియాడారు. 2019లో మహిళల ఆశీస్సులతో సీఎం
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేశారని.. జగనన్న ఆ నమ్మకాన్ని
నిలబెట్టుకున్నారన్నారు. ప్రతి ఒక్క కుటుంబం సీఎం జగన్ మోహన్ రెడ్డిని సొంత
వ్యక్తిలా భావించారన్నారు. గత పాలకులు ఎప్పుడూ మహిళల సంక్షేమం, సాధికారిత కోసం
కృషి చేయలేదని విమర్శించారు. ఇన్ని సంక్షేమ ఫలాలు మళ్ళీ పొందాలంటే
రాష్ట్రానికి సీఎంగా మరలా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉండాలన్నారు. పేదల కోసం
ఆలోచించే వై.ఎస్. జగన్ కు ప్రజల ఆశీస్సులు, దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ
ఉంటాయని.. ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలని హోంమంత్రి తానేటి వనిత
ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, , జడ్పీ సీఈవో
కె.ఎస్.ఎస్. సుబ్బారావు, ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డా||
కొడాలి రామ్ ప్రసీన్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.