ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ : వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో కనీసం 85 శాతం పోలింగ్
నమోదు లక్ష్యంగా ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలను
చేపడుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
విజయవాడ, డీఆర్ఎం బంగ్లా సమీపంలోని టీటీడీ కళ్యాణ మండపం రోడ్డు వద్ద
గురువారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్
డిల్లీరావు నేతృత్వంలో సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్
పార్టిసిపేషన్ (స్వీప్) కింద ఓటరు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ
సందర్భంగా ఏర్పాటుచేసిన ర్యాలీని కలెక్టర్ డిల్లీరావు.. జాయింట్ కలెక్టర్
డా. పి.సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్
దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, వాకర్స్ తదితరులతో
కలిసి జెండీ ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)
2011లో స్వీప్‌ను ప్రారంభించిందని.. దీంతో తర్వాత జరిగిన ఎన్నికల్లో మంచి
ఫలితాలు వచ్చాయని.. అందువల్ల ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు
వివరించారు. ఈసీఐ, రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి ముకేష్ కుమార్ మీనా
మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు
నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2019లో జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో
సగటు పోలింగ్ శాతం 85 కాగా.. విజయవాడ పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో
66 శాతంగా ఉందని.. అందువల్ల దీన్ని కూడా 85 శాతానికి చేర్చేందుకు అవగాహన
కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓటు హక్కు ప్రాధాన్యాన్ని
తెలియజేసి.. ఉదాసీనత వైఖరిని తొలగించి ఉత్సాహంగా ఓటు హక్కును
వినియోగించుకునేలా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. ఈవీఎంతో
ఓటు వేసే విధానంపైనా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.
ప్రత్యేక్ష సంక్షిప్త సవరణ-2024 కింద ఓటర్ల జాబితా ప్యూరిఫికేషన్
ప్రక్రియ దాదాపు పూర్తయిందని కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
మాట్లాడుతూ స్వీప్ కార్యక్రమం ద్వారా ఓటు నమోదు, ఒక ప్రాంతం నుంచి మరో
ప్రాంతానికి ఓటు మార్పు, ఈవీఎంతో ఓటు హక్కు వినియోగించుకోవడం తదితర
అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఓటుకు సంబంధించి బీఎల్వోల
నుంచి సమాచారం పొందొచ్చని.. అదే విధంగా ఓటర్ హెల్ప్‌లైన్, ఓటర్ సర్వీస్
పోర్టల్ వంటి ఆన్లైన్ వేదికల నుంచి కూడా సమాచారం తెలుసుకోవచ్చని..
కమిషనర్ వివరించారు. కార్యక్రమంలో విజయవాడ అడిషనల్ కమిషనర్
(ప్రాజెక్ట్స్) కేవీ సత్యవతి, కలెక్టరేట్, వీఎంసీ అధికారులు, సిబ్బంది,
వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.