నెల్లిమర్ల : యువగళం కాదు ప్రజాగళమని లోకేశ్ నిరూపించారని టీడీపీ రాష్ట్ర
అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ‘‘లోకేశ్ నాయకుడే కాదు.. పోరాట యోధుడు
కూడా. యువగళం పాదయాత్రకు ఎన్నో అడ్డంకులు సృష్టించారు. అయినా లెక్క చేయకుండా
ప్రభుత్వ తప్పులు, అవినీతిని ఎండగట్టారు. జగన్ కొత్త నాటకాలు ఆడుతున్నారు.
తెదేపా, జనసేనను బలహీనవర్గాలకు దూరం చేయాలని కుట్ర పన్నారు. కులాలు, మతాల మధ్య
చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ రాష్ట్రాన్ని
సర్వనాశనం చేశారు.. మొత్తం దోచేశారు. టీడీపీ-జనసేన కలిసి పనిచేస్తే వైకాపాకు
డిపాజిట్లు కూడా రావు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ -జనసేనను ప్రజలు
ఆదరించాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.
పసుపుమయంగా మారిన జాతీయ రహదారి : యువగళం-నవశకం ప్రాంగణంలో పండుగ వాతావరణం
నెలకొంది. భారీ బెలూన్లు, డీజే చప్పుళ్లు, జై లోకేశ్ నినాదాలతో ప్రాంగణం
హోరెత్తింది. నవశకం వేదికపై ఆహూతులను ఉత్తరాంధ్ర సంప్రదాయ కళా నృత్యాలు
అలరించాయి. సభా ప్రాంగణంలో ఎన్టీఆర్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్,
బాలయ్య భారీ కటౌట్లు ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి
తరలివచ్చిన టీడీపీ , జనసేన కార్యకర్తల కేరింతలతో సభాప్రాంగణం సందడిగా మారింది.
విశాఖపట్నం నుంచి పోలిపల్లి వరకు బ్యానర్లు, జెండాలు, ఫ్లెక్సీలతో జాతీయ
రహదారి పసుపు మయంగా మారింది. కార్యకర్తలు దూరం నుంచి కూడా కార్యక్రమాన్ని
వీక్షించేందుకు వీలుగా సభా ప్రాంగణం వెలుపల అతి పెద్ద ఎల్ఈడీ తెరలు ఏర్పాటు
చేశారు.
[image: image.png]