2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ. 3,89,673 కోట్లు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల
ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సంతాపం
హైదరాబాద్ : తెలంగాణ శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆర్థిక
పరిస్థితిపై సభలో స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి భట్టి
విక్రమార్క శ్వేత పత్రాన్ని విడుదల చేసి ప్రసంగించారు. 42 పేజీల శ్వేత
పత్రాన్ని సభ్యులకు అందించారు. ‘‘ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ
సాధించుకున్నాం. గత ప్రభుత్వం వనరులను సక్రమంగా ఉపయోగించలేదు. రోజూవారీ
ఖర్చులకూ ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి
రావడాన్ని నేను దురదృష్టంగా భావిస్తున్నాను. దశాబ్దకాలంలో జరిగిన ఆర్థిక
తప్పిదాలు ప్రజలకు తెలియాలి. ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తాం.
సవాళ్లు అధిగమించే దిశలో శ్వేతపత్రం మొదటి అడుగు’’ అని భట్టి అన్నారు.
అంతకుముందు సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు
అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా అక్బరుద్దీన్, సీపీఐ
శాసనసభా పక్ష నేతగా కూనంనేని సాంబశివరావు పేర్లను స్పీకర్ గడ్డం ప్రసాద్
కుమార్ ప్రకటించారు.
నివేదికను చదివే సమయం కూడా ఇవ్వలేదు : హరీశ్‌రావు
అయితే 42 పేజీల పుస్తకం ఇచ్చి వెంటనే మాట్లాడాలంటే ఎలా..? అని మాజీ మంత్రి
హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. నివేదికను చదివే సమయం కూడా తమకు
ఇవ్వలేదని, ముందు రోజే డాక్యుమెంట్ ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు.
ప్రభుత్వ సమాధానం సంతృప్తిగా లేకపోతే నిరసన చేపట్టే అవకాశం తమకు ఉందని
తెలిపారు. సభను హుందాగా నడిపేందుకు భారాస పూర్తిగా సహకరిస్తుందని
వెల్లడించారు. అనంతరం సభను స్పీకర్ అరగంట పాటు వాయిదా వేశారు.
శ్వేతపత్రంలోని ప్రధానాంశాలు ఇవీ : రాష్ట్ర మొత్తం అప్పులు రూ. 6,71,757
కోట్లు. 2014-15 నాటికి రాష్ట్ర రుణం రూ. 72,658 కోట్లు. 2014-15 నుంచి
2022-23 మధ్య కాలంలో సగటున 24.5 శాతం పెరిగిన అప్పు. 2023-24 అంచనాల ప్రకారం
రాష్ట్ర రుణం రూ. 3,89,673 కోట్లు. 2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో
దేశంలోనే అత్యల్పం. 2023- 24 నాటికి 27.8 శాతానికి పెరిగిన రుణ, జీఎస్డీపీ
శాతం. బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20శాతం అంతరం. 57 ఏళ్లలో తెలంగాణ
అభివృద్ధికి రూ. 4.98 లక్షల కోట్ల వ్యయం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు
పెరిగిన రుణభారం. రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగిన రుణ చెల్లింపుల భారం.
రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీతాలకు 35 శాతం వ్యయం. రోజూ వేస్ అండ్ మీన్స్‌పై
ఆధారపడాల్సిన దుస్థితి. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ. 2023లో
అప్పుల్లో కూరుకుపోయింది. బడ్జెటేతర రుణాలు పేరుకుపోయి అప్పుల ఊబిలో తెలంగాణ
ఉందని పేర్కొన్నారు.