రూ. 8 లక్షల వార్షికాదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన
జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను విడుదల
చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
గుంటూరు : జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విడుదల చేశారు. అర్హులైన 390
మంది విద్యార్థులకు రూ. 41.59 కోట్లను సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్
నొక్కి జమచేశారు. వీరిలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన 95
మందికి లబ్ధి చేకూరనుంది. అదే విధంగా 95 మందిలో తిరిగి మెయిన్స్‌లో ఉత్తీర్ణత
సాధించిన 11 మంది లబ్ధి పొందనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..
చదువుకునేందుకు పేద విద్యార్ధులు ఇబ్బంది పడకూడదని అన్నారు. పిల్లల చదువుల
భారం తల్లిదండ్రులపై పడొద్దని తెలిపారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం
ఆర్థిక సాయం చేస్తుందని అన్నారు. విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్ధుల కల
నెరవేర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు.పేద, మధ్యతరగతి, వెనుకబడిన కుటుంబాల
విద్యార్థుల తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన పథకమని సీఎం జగన్
పేర్కొన్నారు. విదేశీ విద్యాదీవెన కింద రాష్ట్రానికి చెందిన పలువురు
విద్యార్థులు విదేశాల్లో టాప్ యూనివర్సిటీలో చదువుతున్నారని, వారందరికీ
ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అలాగే ప్రిలిమ్స్ పాసైతే లక్ష, మెయిన్స్‌కు
క్వాలిఫై అయితే లక్షన్నర ఇస్తున్నామని తెలిపారు. రూ. 8 లక్షల వార్షికాదాయం
ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందుతుందని చెప్పారు.
జగనన్న తోడుగా ఉంటాడన్న భరోసా : జగనన్న విదేశీ విద్యా దీవెన, సివిల్ సర్వీసెస్
ప్రోత్సాహకాల నిధులు విడుదల సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
మాట్లాడుతూ అన్ని జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్న కలెక్టర్లు, పిల్లలు,
పిల్లల తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, విదేశీ దీవెన పొందుతూ అక్కడ చదువుతూ
వీసీల్లో పాల్గొంటున్న వారందరికీ అభినందనలు. రాష్ట్రంలో ఎవరికైనా కష్టపడి
చదివితే మంచి యూనివర్సిటీల్లో సీటు వస్తే ఫీజులు ఎంతైనా మనం ఇబ్బంది పడాల్సిన
పని లేదు, మన తల్లిదండ్రులకు, మనకు ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా
ప్రభుత్వం తోడుగా ఉంటుంది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లోగానీ,
లేదా క్యూఎస్ ర్యాకింగ్స్లో గానీ టాప్ 50 కాలేజీల్లో 21 ఫ్యాకల్టీలు కవర్
చేస్తూ 350 కాలేజీలు, వీటిలో సీట్లు ఎవరికి వచ్చినా కూడా రాష్ట్రం నుంచి
ఎంటైర్ ఫీజు చెల్లిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన
వారికి రూ.కోటీ 25 లక్షల దాకా, మిగిలిన వారికి రూ.కోటి దాకా తోడుగా నిలబడే
కార్యక్రమం జరుగుతోంది. 51 మందికి కొత్తగా అడ్మిషన్లు వచ్చాయి. వారికి ఈ
కార్యక్రమం ద్వారా ఫీజులు రూ.9.5 కోట్లు ఇస్తున్నామన్నారు.
మీరు మంచి చేయాలన్నదే మా తాపత్రయం : విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటి దాకా
చదువుతున్న 408 మంది పిల్లలకు, ఈ సీజన్ లో ఫీజులు చెల్లించాల్సిన 390 మందికి
వాళ్ల ఫీజు కలుపుకుంటే రూ.41.59 కోట్లు ఇస్తున్నాం. దాదాపుగా రూ.107 కోట్లు
408 మంది పిల్లల కోసం ఈ పథకం పెట్టినప్పటి నుంచి ఖర్చు చేస్తున్నాం. ఈ పథకం
ఎంత సంతృప్తినిస్తుందంటే ఇదొక యాస్పిరేషన్. మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్లు
స్పూర్తి పొంది, టాప్ కాలేజీలలో సీట్లు తెచ్చుకొని మీ తలరాతలు మారడానికి
ఉపయోగపడాలన్నారు. ఎక్కడో ఒక చోట కెరీర్లో గొప్పగా ఎదిగిన తర్వాత ఈ తరహా సాయం
రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించిందో, అది ఎక్కడో ఒక చోట మన రాష్ట్రానికి కూడా
కొంత కాంట్రిబ్యూషన్ ఇవ్వగలగాలి. మంచి సీఈవోలుగా పెద్ద పేరు తెచ్చుకుంటే
రాష్ట్రాన్ని గుర్తు పెట్టుకొని మన పిల్లలకు మీరు మంచి చేయాలన్నదే మా
తాపత్రయం, నా కోరిక. ఈ ఫీజులు ఆశ్చర్యకరం అనిపించేలా ఉన్నాయన్నారు.
చేతులు దులుపుకున్న గత ప్రభుత్వం : గతంలో ఇదే విదేశీ విద్యాదీవెనను గత
ప్రభుత్వాలు కొద్దో గొప్పో చేయాలని ప్రారంభించాయి. కానీ ఇవాళ మనం చేస్తున్న
విదేశీ విద్యాదీవెన కార్యక్రమం గత ప్రభుత్వ హయాంలో ఒక మోసంగా మిగిలిపోయింది.
ఒకవైపు ఫీజులు రూ.70 లక్షలు, రూ.60లక్షలు, రూ.50లక్షలు కనిపిస్తుంటే రూ.10
లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇలా చేయడం వల్ల ఏ ఒక్కరికీ మంచి
జరగదు. అప్పులు పాలయ్యే పరిస్థితి ఎప్పటికీ మారదు. ఎప్పటికీ బ్రతుకులు మారవు.
ఏదో చేశామంటే చేశామన్న పరిస్థితి. దాన్ని కూడా సక్రమంగా మనసు పెట్టి చేయలేదు.
చిత్తశుద్ధి లేదు. దాదాపుగా 3,326 మందికి 2016–17 సంవత్సరానికి సంబంధించి
రూ.318 కోట్ల బకాయిలుగా వదిలేశారు. యూనివర్సిటీలకు సంబంధించిన కాలేజీల్లోనూ
పారదర్శకత లేదు. ఎల్లయ్య, పుల్లయ్య కాలేజీల్లో సీట్లు వచ్చినా, రికమెండేషన్లు
పెట్టుకుని కొంతమంది మాత్రమే అర్హత పొందేవారు. ఇవన్నీ ఇప్పుడు
మార్పుచేశామన్నారు.
అర్హతే ప్రామాణికంగా ఎంపిక : అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నాం.
సిఫార్సులు, రాజకీయ జోక్యం, అవినీతి, లంచాలు లేవు. ఎవరికైనా 21 ఫ్యాకల్టీలలో,
టాప్ 50 కాలేజీలలో ఎవరికి సీటు వచ్చినా రూ.1.25 కోట్లు వరకు గరిష్టంగా
పరిమితిపెట్టాం. మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలని ఇవన్నీ చేస్తున్నాం. మన
పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్లుగా ఎదగాలి, రాష్ట్రానికి ఏదో ఒక రోజు, ఎప్పుడో
ఒక రోజు మంచి చేసే అవకాశం, పరిస్థితి రావాలి. మీ కథనాలు స్ఫూర్తిగా నిలవాలని
మనసారా కోరుకుంటున్నానని చెబుతూ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు
తెలియజేస్తున్నానని సీఎం తన ప్రసంగం ముగించారు.