ఆరోగ్యశ్రీ పథకం కింద ఇప్పటివరకు చికిత్సలు, సర్జరీలు 2,01,133
ఏప్రిల్ 2019 నుండి 17 డిసెంబర్ 23 వరకు ఆరోగ్యశ్రీపై మొత్తం ఖర్చు 447 కోట్ల
27 లక్షల 16 వేల 145 రూపాయలు
మచిలీపట్నం : దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం
అందిస్తున్నామని, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రి ఖర్చు రూ.1000 దాటితే
ఆరోగ్యశ్రీ పరిధిలోనికి వస్తుందని ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ
నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సోమవారం తాడేపల్లి సీఎం క్యాంప్
కార్యాలయంలో ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా వైద్య ఆరోగ్య శాఖ
మంత్రి విడదల రజిని, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ
కింద రూ. 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించడాన్ని, ప్రతిఇంటికి వెళ్లి
ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కల్పిస్తూ కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ
కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంచనంగా ప్రారంభించారు.
కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలోని కలెక్టరేట్ లోని వీడియో
సమావేశపు మందిరం నుంచి ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా
కలెక్టర్ పి.రాజాబాబు , జిల్లా ఎస్పీ పి.జాషువా. డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్
గీతాబాయి, జెడ్పి సిఇఓ జ్యోతిబసు, డి సి హెచ్ ఎస్ పి.శ్రావణ్ కుమార్, వైఎస్ఆర్
ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు మాట్లాడుతూ, జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్
–2.లో భాగంగా జనవరి 1, 2024 నుంచి ప్రతి వారం గ్రామీణప్రాంతాల్లో మండలానికి ఒక
గ్రామ సచివాలయంలో, పట్టణ ప్రాంతాల్లో ప్రతి వారం ఒక వార్డు పరిధిలో జగనన్న
ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. కృష్ణా జిల్లాలో మొత్తం
ఆరోగ్యశ్రీ కార్డులు 5 లక్షల 17 వేల 563 ఉన్నాయని, ఆరోగ్యశ్రీ వైద్య సేవలు
కృష్ణాజిల్లాలో 17 ప్రైవేట్ ఆసుపత్రులు, ఒక ప్రభుత్వ ఆసుపత్రి 6 కమ్యూనిటీ
హెల్త్ సెంటర్లు 45 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుర్వేద ఆసుపత్రి ఒకటి తో
కలిపి మొత్తం 70 ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయని తెలిపారు. 2019
ఏప్రిల్ నుంచి 2023 డిసెంబర్ 17వ తేదీ వరకు చికిత్సలు సర్జరీలు మొత్తం
2,01,133 జరిగాయని ఇందుకోసం మొత్తం ఖర్చు 447 కోట్ల 27 లక్షల 16 వేల 145
రూపాయలు అయిందని ఆయన తెలిపారు.