తుపాన్లను ఆపలేకపోవచ్చు కానీ నష్టాన్ని నియంత్రించవచ్చు
ప్రాజెక్టుల నిర్వహణకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు
అంగన్వాడీల న్యాయపోరాటానికి టీడీపీ అండ
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
గుంటూరు : తుపాను లాంటివి వచ్చినప్పుడు దాన్ని మనం ఆపలేకపోయినా కలిగే నష్టాన్ని నియంత్రించగలమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తుపాను కల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో, సహాయక చర్యలు చేపట్టడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ‘పోలవరం పూర్తయితే ఆ జాలాలు కృష్ణా డెల్టాకు వస్తాయి. పోలవరంలో ఎప్పుడూ నీళ్లు త్వరగా వస్తాయి. గోదావరి వరదలు కూడా ముందుగానే వస్తాయి. నవంబరు, డిసెంబరు నెలలో తుపానులు ఎక్కువగా వస్తాయి. పట్టిసీమ ద్వారా సకాలంలో సాగునీరు ఇస్తే నవంబర్ కంటే ముందే పంట చేతికొస్తుంది. తుపాను నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. పులిచింతల జలాలు అత్యవసర పరిస్థితుల్లో తాగు, సాగు నీటి అవసరాలకు వినియోగించాలి. విధిలేని పరిస్థితుల్లో పులిచింతల ప్రాజెక్టును ఆపరేట్ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరవు కారణంగా 26 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేకపోయారు. వేసిన కొన్ని చోట్ల వర్షాలు లేక, దిగుబడి రాక అరకొర పంట వచ్చింది. నీటిపారుదల రంగంపై రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేసింది. రాష్ట్రంలోని ప్రాజెక్టులను కనీసం నిర్వహించలేకపోయింది. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. పులిచింతల ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. గుండ్లకమ్మ గేట్ల మరమ్మతుల కోసం టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వంపై విశ్వాసం లేక గుత్తేదారులు ఆసక్తి చూపలేదు. ప్రాజెక్టుల నిర్వహణ సరిగా లేక పొలాలకు ఇవ్వాల్సిన నీళ్లు వృథాగా పోయాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
22 లక్షల ఎకరాల్లో పంట నష్టం : 15 జిల్లాల్లో 22 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మురుగు కాలువల నిర్వహణ సరిగా ఉంటే నష్టం తీవ్రత తగ్గేది. విపత్తులు వచ్చినప్పుడు ప్రజల్లో భరోసా కల్పించాలి. తుపాను కారణంగా రైతులు ఎంత పంట నష్టపోయారో ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించలేదు. జాతీయ విపత్తు సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాలి. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రానికి నేను లేఖ రాశా. విపత్తు కారణంగా రూ.3,711 కోట్ల నష్టం జరిగిందని చెబుతున్నారు. రహదారులకు రూ.2,600 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. పంట నష్టం కేవలం రూ.700 కోట్లు మాత్రమే జరిగిందన్నారు. కరవు, తుపానులు వస్తే ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు.
అంగన్వాడీల న్యాయపోరాటానికి టీడీపీ అండ : అంగన్వాడీల న్యాయ పోరాటానికి టీడీపీ అండగా ఉంటుంది. ఆందోళనలు అణచివేస్తామని అనడం ప్రభుత్వానికి మంచిది కాదు. ఒక్క ఛాన్స్…పాపం ప్రజలకు శాపంగా మారింది. ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. 24 శాతం నిరుద్యోగంతో ఏపీ నంబర్ వన్‌గా ఉంది. వైసీపీ నేతల లెక్కలు మొత్తం తారుమారు అయ్యాయని చంద్రబాబు అన్నారు.
జగన్‌రెడ్డిని సాగనంపేందుకు ప్రజలు సిద్ధం : రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్‌రెడ్డిని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీ అరాచక పాలనపైనే చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికల తర్వాత వైకాపా ఉనికే ఉండదు. ఓటమి భయంతోనే వైసీపీ అభ్యర్థులను అటుఇటు మారుస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని ఇప్పుడే తెలిసింది. ఈసారి టీడీపీ అభ్యర్థుల ఎంపికలో సరికొత్త సాంకేతికత ఉపయోగిస్తాం. వైకాపాలో ఎవరైనా మంచివాళ్లు ఉండి టీడీపీలోకి వస్తామంటే ఆలోచిస్తాం. మునిగే పడవలో ఉండాలని ఎవరైనా ఎందుకు అనుకుంటారు? ఒక చోట దోపిడీ చేసిన వాళ్లను ఇతర నియోజకవర్గాలకు పంపితే గెలుస్తారా? 5 కోట్ల ప్రజలకు, సైకో జగన్‌కు మధ్య ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అక్కడ టికెట్ రాలేదని ఇక్కడకు వస్తామంటే ఎలా : రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ సన్నద్ధమవుతోంది. అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించింది. దీనికి సంబంధించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి త్వరగానే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. పొత్తులో ఉన్నామని, సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నామని స్పష్టత ఇచ్చారు. ఈసారి అభ్యర్థుల ఎంపిక విధానం వినూత్నంగా ఉండబోతోందని చెప్పారు. వైసీపీలోని అసంతృప్తులు తమకెందుకని అన్నారు. అక్కడ టిక్కెట్ రాలేదని తమ దగ్గరకు వస్తామంటే తమకు అవసరం లేదన్నారు. వైసీపీలో మంచి వాళ్లు ఉంటే పార్టీలోకి తీసుకునే అంశంపై ఆలోచన చేస్తామన్నారు. మద్యపాన నిషేధం చేయకుంటే ఓటు అడగనని చెప్పిన జగన్‌కు ఇప్పుడు ఓటు అడిగే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో ఉండేవాళ్లు ఈ రాష్ట్రంలో ఓటు వేయొద్దని ఎలా చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం సవ్యంగా ఉంటే వాళ్లు వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళ్తారని నిలదీశారు. జగన్ చేసేవన్నీ చెత్త పనులే అని మండిపడ్డారు. రుషికొండ మీద టూరిజం హోటల్ పేరుతో రూ. 500 కోట్లతో భవనం కడతారా అని అని నిలదీశారు. రుషికొండలో కట్టడాలు కట్టొద్దని చెప్పినా కొండను తవ్వేస్తారా అని ప్రశ్నించారు. చట్టం సీఎంకు వర్తించదా అని నిలదీశారు. జగన్ లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండడానికి అర్హుడే కాదన్నారు. మూడు నెలల్లో జగన్ ఇంటికి వెళ్తున్నారు..తరలింపు సాధ్యమా.? ఎలా తరలిస్తారని అడిగారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని చంద్రబాబు హెచ్చరించారు.