ఎమ్మెల్యేలు, మాజీలు, కీలక నేతలు టచ్ లో ఉన్నారు
ఈ నెల 21న ఏపీకి సంబంధించి ఢిల్లీలో కీలక సమావేశం
సంస్థాగతంగా బలోపేతంపైనే దృష్టి
పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
విజయవాడ : ఏపీసీసీ ఆధ్వర్యంలో గడిచిన రెండు రోజులుగా విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో జరుగుతున్న వరుస సమావేశాలకు సంబంధించి పలు అంశాలను పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గురువారం మీడియాకు వివరించారు. ముందుగా కాంగ్రెస్ నాయకులు సంజయ్ గాంధీ జయంతి సందర్భంగా పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తో పాటు ముఖ్య నేతలు అందరూ ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సీడ్ల్యుసీ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఏపీసీసీ కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేయడంపైనే ప్రధానంగా ద్రుష్టి కేంద్రీకరించినట్లు ఆయన వివరించారు. ఏఐసీసీ కార్యదర్శులు సీడీ మెయప్పన్, క్రిష్టోఫర్ తిలక్, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, కార్యనిర్వహక అధ్యక్షులు మస్తాన్ వలి, జంగా గౌతం, సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్స్ ఆర్.శ్రీరామ్ మూర్తితో పాటు జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి సంబంధించిన పలు అంశాలు చర్చించి వారి నుంచి కొన్ని సూచనలను తీసుకున్నారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ ఐదేళ్లు పాలించిన చంద్రబాబు, నాలుగున్నరేళ్లు అధికారంలో ఉన్న జగన్ వారి వ్యక్తిగత స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, టీడీపీలు సొంత లాభం కోసం పనిచేసుకునే పార్టీలని విమర్శించారు. రాష్ట్ర హక్కులు, నిధుల కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో విభజన హామీలకు సంబంధించి ఒక్కదానిని కూడా ఆ తరువాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదా, పోలవరం, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, రైల్వే జోన్ వంటి ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన వివిధ హామీలు నెరవేరాలంటే కేంద్రంలో కాంగ్రెస్ రావడమే మార్గమని, నేతలు, కార్యకర్తలు ఆ దిశగా క్రుషి చేయాలని చెప్పారు. రాష్ట్ర హక్కులను, హామీలను సాధించడంలో తెలుగుదేశం, వైసీపీలు పూర్తిగా విఫలం చెందాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడు ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయాలు తరువాత, ఏపీలోనూ కాంగ్రెస్ అధికారం చేపడితే బావుంటుంది అని ప్రజలు భావిస్తున్నారన్నారు. గడిచిన తొమ్మిదిన్నరేళ్లుగా ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాన్ని మోసం చేసిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించారని తెలిపారు. దానికి అనుగుణంగానే మంచి మేనిఫేస్టోతో ప్రజల్లోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు ఆయన వివరించారు. డిసెంబర్ 21వ తేది ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అత్యంత కీలకమైన, హైలెవల్ డెలిగేషన్ మీటింగ్ ఉంటుందని పీసీసీ అధ్యక్షుగు గిడుగు రుద్రరాజు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల ప్రణాళిక ఖరారు అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఆంధ్రరత్న భవన్ లో పార్టీ విభాగాలు, ముఖ్య నేతలతో మూడు రోజులు జరిగే సమావేశ వివరాలను డిసెంబర్ 21న ఢిల్లీ పెద్దల ద్రుష్టికి తీసుకెళ్లి, వారి సలహాలు, సూచనలతో ఎన్నికలకు సంబంధించి భవిష్యత్ కార్యచరణ రూపొందిస్తామని గిడుగు రుద్రరాజు వెల్లడించారు. వైసీపీ ఇన్ఛార్జ్ ల మార్పు వ్యవహారంపై పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ ఒక చోట చెల్లని కాణీ మరో చోట ఎలా చెల్లుతుందని ఎద్దేవా చేశారు. దళిత పక్షపాతి అని చెప్పుకునే వైసీపీ నేతలు ప్రస్తుతం ఇన్ఛార్జ్ ల మార్పులన్నీ రిజర్వ్ డ్ నియోజకవర్గాలలోనే చేస్తున్నారని, దీనిపై ప్రజలు కూడా గందరగోళంలో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన కొలమానం ముఖ్యమంత్రి పనితీరు, పథకాలేనని, మార్పు జరగాలంటే.. సీఎం మార్పు జరగాలని తెలిపారు. అదికాకుండా ఎన్ని చేసినా కొత్త సీసాలో పాత సారానే అన్నారు. ఎమ్మెల్యేలను మార్చితే ఉపయోగం ఏమిటని ఈ సందర్భంగా ప్రశ్నించారు. అయినా అవన్నీ వైసీపీ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్, కాంగ్రెస్ రెండు పదాలూ కాంగ్రెస్ పార్టీవేనని తెలిపారు. ఆ రెండింటినీ వదిలి ప్రజల్లోకి వెళ్లాలని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వైసీపీ నేతలకు సవాలు విసిరారు. ఇప్పుడు రాష్ట్రంలో అమలవుతున్నవన్నీ… గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలేనని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒరిజినల్ కాదు డూప్లికేట్ అని ప్రజలు ఇప్పటికే గుర్తించారని పీసీసీ అధ్యక్షులు పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు వివిధ పార్టీల నేతలూ తమకు టచ్ లో ఉన్నారని మరోసారి పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. వైసీపీ నేతల విమర్శలపై మాట్లాడుతూ చంద్రబాబు, జగన్ లు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచి తమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారని… గుర్తు చేశారు. భావ సారూప్యత ఉన్న పార్టీలు, గ్రూపులను కలుపుకుని ముందుకు వెళ్తామని తెలిపారు. డిసెంబర్ 21న ఢిల్లీ వెళ్లినప్పుడు సీపీఐ, సీపీఎం అగ్రనేతలను కలిసే ప్రయత్నం చేస్తానని ఆయన చెప్పారు. పీసీసీ సోషల్ మీడియా విభాగం, ఏపీ కాంగ్రెస్ పార్టీ ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్ట్విటర్ అధికారిక పేజీలకు సంబంధించిన క్యూర్ కోడ్ లను పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ప్రారంభించారు. సోషల్ మీడియాతో ప్రజలను పార్టీకి మరింత దగ్గర చేసే విధంగా పార్టీ కార్యకర్తలు, నేతలూ చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ సోషల్ మీడియా ఛైర్మన్ రాకేష్ కుట్టి, మనోహర్ గంగిరెడ్డి, లక్షణ్ యాదవ్, అరుణ తేజ దూలంతో పాటు పలువురు సోషల్ మీడియా కార్యకర్తలు పాల్గొన్నారు.