విజయవాడ : ఏపీలో దారుణ పాలన చూడటం బాధాకరంగా ఉందని మాజీ సీఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేస్తే కొందరిలో అసహనం కనిపిస్తోందన్నారు. నిరసన తెలియజేయకపోతే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని ప్రశ్నించారు. చిన్న చిన్న అంశాలకే ఐపీసీ సెక్షన్లతో కేసులు నమోదవుతున్నాయన్నారు. రాజకీయ పరంగా దిగువస్థాయి వారిపై కేసులు పెడితే స్వేచ్ఛగా ఎన్నికలు ఎలా జరుగుతాయని నిలదీశారు. రాష్ట్రంలో నిరవధికంగా సెక్షన్ 30, 144 సెక్షన్లు ఎలా కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా పోలీసు కేసులపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ స్వతంత్రంగా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిందని, త్వరలోనే బాధితులకు న్యాయ సలహాలు కూడా అందిస్తామన్నారు. స్వతంత్ర కమిటీ ఇతర ప్రాంతాల్లోనూ పర్యటిస్తుందని నిమ్మగడ్డ చెప్పారు.