రాజమహేంద్రవరం : వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలకు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును నిర్వాహకులుు ఆహ్వానించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ, చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ మహాసభలు నిర్వహించనున్నారు. అంధ్రమేవ జయతే అనే నినాదంతో తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేలా 2024 జనవరి 5,6,7 తేదీల్లో శ్రీ రాజరాజనరేంద్రుల వారి పట్టాభిషేక మహోత్సవ సహస్రాబ్ది సందర్భంగా రాజమహేంద్రవరంలోని గైట్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఈ మహాసభలు జరగనున్నాయి. ఈ సభలకు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, చైతన్య విద్యా సంస్థల అధినేత చైతన్యరాజు విశాఖలో ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. వారి ఆహ్వానం అందుకున్న ఆయన సభలకు విచ్చేసేందుకు అంగీకరించినట్లు వారు తెలిపారు. జనవరి 6న ఉదయం 10గంటలకు జరిగే కృతజ్ఞతాంజలి సభకు హరిబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి మహాసభలకు సహకరించిన వదాన్యులు, కళాకారుల్ని సత్కరించి ఆత్మీయ సందేశాన్ని ఇస్తారని గజల్ శ్రీనివాస్ తెలిపారు.