14 కార్పొరేషన్ల ఉన్నతాధికారులతో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల సమీక్ష
హైదరాబాద్ : ప్రపంచంవ్యాప్తంగా వస్తున్న మార్పులను అనుగుణంగా ప్రస్తుత పోటీని తట్టుకునేలా సాంకేతికతను అందిపుచ్చుకుని అన్నదాతలకు ఉపయోగపడేలా కార్పొరేషన్లు పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం సచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖలపై మూడోరోజూ తుమ్మల సమీక్ష నిర్వహించారు. బుధవారం సమావేశంలో వ్వయసాయ 14 కార్పొరేషన్లకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. టీఎస్ ఆయిల్ ఫెడ్, టీఎస్ ఆగ్రో, మార్క్ ఫెడ్, టీఎస్ డీసీ, టీఎస్ ఎస్ ఓసీఏ, ట్రెబ్స్, హాకా, తదితర కార్పొరేషన్ల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..కార్పొరేషన్లు విజయవంతంగా రైతులకు సేవలు అందించేందుకు అవసరమైన పద్దతులను అవలంభించాలన్నారు. పంటల సాగులో ఇతర దేశాలు అనుసరిస్తున్న అత్యాధునిక విధానాలను మనం అలవరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర దేశాల నుంచి అత్యాధునిక పద్దతులను అందిపుచ్చుకుని రైతులకు లబ్ధిచేకూర్చేలా పనిచేయాలని సూచించారు. కార్పొరేషన్లు కేవలం వ్యాపార దృక్పథంతోనే పనిచేయవద్దని రైతులకు ఉపయోగపడేలా విధానాలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాత పద్దతులకు స్వస్తిపలికి సరికొత్త విధానాలతో రైతులోకానికి ఉపయుక్తంగా ఉండేలా కార్యాచరణ చేపట్టేలా కార్పొరేషన్లు పనిచేయాలన్నారు. ప్రతీ కార్పొరేషన్ సరికొత్త సాంకేతికను అందిపుచ్చుకుని సమర్థంగా పనిచేసేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలను అందిపుచ్చుకుని వాటిని సక్రమమైన పద్దతుల్లో అమలు పరిచేలా కార్పొరేషన్లు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ దిశగా ఇప్పటి వరకు కార్పొరేషన్లు చేసిన కృషి ఏంటో పూర్తి నివేదిక సమర్పించాలని ఆయా కార్పొరేషన్ల అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశించారు. రైతులకు నష్టం జరిగే ఎటువంటి విధానాలకైనా వెంటనే స్వస్తిపలకాలని సూచించారు. ప్రైవేటు కంపెనీలకు లబ్ధిచేకూర్చే యంత్రాలు, ఎరువులను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించొద్దన్నారు. అన్నిరకాల కార్పొరేషన్ల అభివృద్ధికి వెంటనే ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. వచ్చే ఐదేళ్ల కు అవసరమయ్యేలా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా, రైతులు సంతోషంగా ఉండేవిధంగా ప్రణాళిక రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యానశాఖ భూములను వెంటనే శాఖపరంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. అన్ని కార్పొరేషన్ల ఆస్తుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలను రైతులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. త్వరలోనే కార్పొరేషన్ల పనితీరుపై మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు.