మచిలీపట్నం : రహదారులపై ఉన్న ధాన్యాన్ని వెంటనే వాహనాలు ఏర్పాటు చేసి మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ధాన్యం సేకరణ, ఓటర్ల జాబితా సవరణ, లంక భూముల పురోగతి తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారులపై రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారని, రెండు లేదా మూడు రోజులు అవగానే ఆ ధాన్యాన్ని వాహనాలకు ఎక్కించి ఆన్లైన్ ద్వారా మ్యాపింగ్ చేసి సంబంధిత మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యాన్ని ఎక్కువ రోజులు రహదారులపై ఆరబెట్టుకోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఆరబెట్టుకున్న ధాన్యాన్ని తరలించేందుకు వాహనాలు లేవని, ఎవరు పట్టించుకోవడంలేదని ఆరోపణలు రాకుండా జాగ్రత్త వహించాలన్నారు. వాహనాల కొరత ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని స్పష్టం చేశారు. వ్యవసాయ అధికారులు, వీఆర్వోలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి రైతులతో మాట్లాడాలని, ధాన్యం ఎలాగుంది విచారించాలని, వారికి ధైర్యం చెప్పి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా కల్పించాలన్నారు. మిచాంగ్ తుఫాను వలన దెబ్బతిన్న పంటల నష్టం వివరాలను ముమ్మరంగా ఎన్యుమరేషన్ చేపట్టి 18వ తేదీ కల్లా పూర్తి చేయాలన్నారు. ఆ వివరాలను 22వ తేదీ వరకు రైతు భరోసా కేంద్రాల్లో సామాజిక తనిఖీ కోసం అందుబాటులో ప్రదర్శించాలన్నారు.
తుఫాను కారణంగా మొదట్లో ఆఫ్లైన్లో వాహనాలను మిల్లులకు కేటాయించడం జరిగిందని, ఇకపై ఆన్లైన్లో మాత్రమే మిల్లులను మ్యాపింగ్ చేయాలన్నారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 9వ తేదీ వరకు స్వీకరించిన వివిధ రకాల దరఖాస్తుల వివరాలను తెలియజేస్తూ బిఎల్ఓల నుండి ధ్రువీకరణ పత్రం వెంటనే పొందాలన్నారు. ఓటర్ల నమోదు, తొలగింపులు, మార్పులు చేర్పుల కోసం వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలన్నారు. లంక భూముల ఈ కే వై సి చేయడంలో నాగాయలంక వెనుకబడి ఉందని ఇకనైనా పురోగతి సాధించాలని కలెక్టర్ సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఉయ్యూరు ఆర్డిఓ డి రాజు, మచిలీపట్నం గుడివాడ ఆర్డీవోలు ఎం వాణి, పద్మావతి, డిఎస్ఓ పార్వతి, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, తహసీల్దారులు కమిషనర్లు, ఎంపీడీవోలు తదితర అధికారులు పాల్గొన్నారు.