గుంటూరు : మారు మూల గిరిజన ప్రాంతాల్లోని గిరిజనులకు ఓటరు గుర్తింపు కార్డుల జారీకై ప్రత్యేక డ్రైవ్ ను గిరిజన ప్రాంతాల్లో నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు మంగళవారం విజ్ఞాపనను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగానున్న గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకించి. పి.వి.టి.జి.లకు నివాసం ఉండే గ్రామాల్లో 18 సంవత్సరాలు నిండిన యువత ఎంతో మంది ఉన్నారని, అయితే జీవనోపాదికై వారు పలు ప్రాంతాల్లో సంచారం చేస్తున్నందున, వారికెవరికీ ఓటరు గుర్తింపు కార్డుల లేవనే విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి ఆయన తీసుకువచ్చారు. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ముమ్మరంగా జరుగుచున్న నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకించి పి.వి.టి.జి. ప్రాంతాల్లో అర్హులైన యువతకు ఓటరు కార్డుల జారీకై ప్రత్యేకంగా ఓటర్ల నమోదు శిభిరాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని ఆయన కోరారు.