వైసీపీ నేతలతో అత్యవసర భేటీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
అమరావతి: ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులతో జగన్ సమావేశం ఏర్పాటు చేశారు.
అందుబాటులో ఉన్న మంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, గన్నవరం శాసన సభ్యుడు వల్లభనేని వంశీ, శాసనమండలి సభ్యుడు మురుగుడు హనుమంతరావు, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఇందులో పాల్గొన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి, తిప్పల దేవన్ రెడ్డి రాజీనామాల వ్యవహారం వల్ల మంగళగిరి, గాజువాక నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టడానికి గల కారణాలను క్షుణ్ణంగా వివరించాలని సూచించారు. మున్ముందు మరిన్ని మార్పులు ఉంటాయనే సంకేతాలను వైఎస్ జగన్ పంపించారు అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరం లేకపోవడం వల్ల ఇప్పటి నుంచే స్థానిక నాయకత్వాల్లో మార్పులు చేర్పులు చేయక తప్పదని చెప్పారు. దీనికోసం పార్టీ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాల్సి ఉంటుందని సూచించారు. పనితీరు సరిగ్గా లేని నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీల నియామకం తప్పదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో సీటు భయం పట్టుకుంది.