నరసన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణ దాస్
నరసన్నపేట : ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకునేలా అన్ని సౌకర్యాలు కల్పించి, వారికి ఆసరాగా నిలిచే బాధ్యత తీసుకోవాలని నరసన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. నరసన్నపేటలో సోమవారం సాయంత్రం నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో ఎమ్మార్వోలు, సిఎస్డిటీలు, ఏవో లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతాంగ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. ఈసారి ధాన్యం, వాటి కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు చేరుకున్న ఐదు రోజుల లోపే రైతుల అకౌంట్లలో నగదు జమ చేసే చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. దళారీ వ్యవస్థను పూర్తిగా రూపు మాపటం కోసం ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా అడుగడుగునా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి.. మంచి గిట్టుబాటు ధరతో మంచి లాభాలు వచ్చేలా చూస్తున్నదన్నారు. పెట్టుబడి సాయం కింద ఆర్థిక సాయం అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం సీఎం జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని తమ ప్రభుత్వమే అని ఆయన పేర్కొన్నారు. ధాన్యం అమ్మేందుకు వచ్చిన రైతులు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారనే ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాలుగు మండలాల తాసిల్దారులు పలువురు అధికారులు పాల్గొన్నారు.