నెల్లూరు : ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ దానికి సంబంధించిన ఆధారాలను టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బయటపెట్టారు. దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఓబుళాపురం మైనింగ్, మధు కోడా బొగ్గు మైనింగ్ అతిపెద్ద స్కామ్‌లని చెప్పారు. ఇప్పుడు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న సిలికా, క్వాడ్జ్ స్కామ్‌లు ఏపీలో జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడారు. ‘‘నెల్లూరు జిల్లా పోరాటాలకు పుట్టినిల్లు. ఇప్పుడు భారీ స్కామ్‌లకు పుట్టినిల్లుగా జగన్ మార్చేశారు. జిల్లాలో మైన్స్ కుంభకోణంపై ఎన్నో పోరాటాలు చేశాం..డీజీపీకి ఫిర్యాదు చేశాం. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. టీడీపీ హయాంలో ఒక్క టన్నుకి రూ.100 ఉన్న పన్ను ఇప్పుడు వైసీపీ హయాంలో రూ.381కి పెంచేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో మైన్స్ కుంభకోణం జరుగుతోంది. ప్రతి నెలా ఒకటో తేదీకి జగన్‌కు ఆ కమీషన్‌ను చేరుస్తున్నారు. మొత్తం రూ.4,455 కోట్ల విలువైన ఖనిజ సంపద దోపిడీకి గురైంది. త్వరలో కేంద్ర విజిలెన్స్ అధికారులకు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తాం. సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి ఊరు పక్కన దోపిడీ జరుగుతున్నా ఆయన పట్టించుకోవడం లేదని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.