నారా లోకేష్ ను కలిసిన కోటనందూరు మండల ప్రజలు : తుని నియోజకవర్గం చామవరం గేటు వద్ద కోటనందూరు మండల ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా మండలంలో అత్యధిక ప్రజలు వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. తాండవ రిజర్వాయర్ జలాలు పూర్తిస్థాయిలో అందడం లేదు. రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం దెబ్బతినడంలో మా ప్రాంతంలో వ్యవసాయం కష్టతరంగా మారింది. తాండవచెరువు చెరకు ఫ్యాక్టరీ మూతపడడంతో పూర్తిగా వరిసాగుపైనే ఆధారపడ్డాం. ఏలేరు కాలువ నీటిని రిజర్వాయర్ కు మళ్లిస్తే తూర్పుగోదావరి, విశాఖజిల్లాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఏలేరు కాలువ నీరు అందిస్తామని వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పింది. మా మండలంలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు. నారా లోకేష్ స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి విధ్వంసక పాలనలో ఇరిగేషన్ రంగం పూర్తిగా నిర్వీర్యమైంది. కొత్తప్రాజెక్టుల మాట దేవుడెరుగు, ఉన్న ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు కూడా పెట్టలేని దుస్థితిలో వైసిపి ప్రభుత్వం ఉంది. జగన్ ప్రభుత్వం నిర్వాకం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది, పులిచింతల, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి. టిడిపి అధికారంలోకి వచ్చాక తాండవ రిజర్వాయర్ మరమ్మతులు నిర్వహించి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతాం. ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటాం. ఏలేరు కాలువ నీటిని తాండవ చెరువు రిజర్వాయర్ కు మళ్లించే అవకాశాలను పరిశీలిస్తాం. విద్యార్థుల సంఖ్యను బేరీజు వేసి కోటనందూరు మండలంలో జూనియర్ కాలేజీ ఏర్పాటును పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.