గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లో వారం రోజులు పాటు 38 నాటక ప్రదర్శనలు
అందరూ ఆహ్వానితులే…డిసెంబర్ 23 నుంచి 29 వరకు ఉచితం ప్రవేశం
*విజయవాడ : నాటకరంగ విస్తరణకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించడంలో భాగంగా డిసెంబర్ 23 నుంచి 29 వరకు ‘నంది నాటకోత్సవాలు’ జరగనున్నాయి. గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఇందుకు వేదిక కానుంది. ప్రభుత్వం పక్షంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ టి.వి. థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రం నలుమూలల నుండి మొత్తం ఐదు విభాగాలలో 38 నాటక సమాజాలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి.
సోమవారం సంస్థ చైర్మన్ పోసాని కృష్ణ మురళి ఇందుకు సంబంధించిన వివరాలు పత్రికా విలేఖరుల సమావేశంలో నంది అవార్డుల తుది పోటీల న్యాయనిర్ణేతల సమక్షంలో వెల్లడించారు.*
ఎంట్రీల ప్రాధమిక ఎంపిక ఈ ఏడాది సెప్టెంబర్ 6-18 మధ్య జరగగా, ఫలితాలను సంస్థ 19న వెల్లడించింది. ఇందుకోసం మూడు న్యాయనిర్ణేతల బృందాలు పోటీల్లో పాల్గొనడానికి ముందుకు వచ్చిన నాటక సమాజాల వద్దకు వెళ్లి వీటిని ఎంపిక చేసింది. వీటిలో పద్యనాటకాలలో 26 నుంచి 10, సాంఘిక నాటకాలలో 22 నుంచి 6, సాంఘిక నాటికలలో 49 నుంచి 12, కాలేజీ – యూనివర్సిటీ స్థాయిలో 9 నుంచి 5, బాలల విభాగాలలో 9 నుంచి 5 ఎంపిక చేశారు. వారం రోజుల పోటీల్లో తుది ఎంపిక కోసం సంబంధిత సమాజాలు సంస్థ చైర్మన్ సమక్షంలో జరిగిన ‘లాటరీ’లో పాల్గొన్న అనంతరం ప్రదర్శనల ‘షెడ్యూలు’ను సంస్థ ఖరారు చేసింది. దాని ప్రకారం ప్రతి రోజు ఉదయం 9.30 నుండి రాత్రి 10 గంటల వరకు నాటక ప్రదర్శనలు జరుగుతాయి. ఐదు విభాగాలలో స్వర్ణ, రజిత, కాంస్య నంది బహుమతులకై జరగనున్న పోటీలలో ఒక్కొక్క దానిలో ముగ్గురు చొప్పున మొత్తం 15 మంది న్యాయనిర్ణేతలు ఈ తుది ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేస్తారు. అవార్డులు ప్రదానం చేస్తున్న ఏడాదిలో (2022) నాటక రంగంపై వెలువడిన ఉత్తమ రచన గ్రంధం ఎంపిక కోసం మరో ముగ్గురుతో మరో కమిటీ ఏర్పాటు చేశారు.
ఎన్ టీ ఆర్ రంగస్థల పురస్కారం, డా. వై.ఎస్.ఆర్ రంగస్థల పురస్కారం ఎంట్రీలకు 20 వరకు పొడిగింపు : ప్రభుత్వం 1998 నుంచి నంది నాటకోత్సవాల వేదికపై- ‘ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం’ నాటకరంగంలో వ్యక్తిగత స్థాయిలో విశేష కృషి చేసిన నటులకు, కళాకారులకు రూ.1,50,00 నగదు ప్రదానం చేస్తున్నది. కాగా ఇప్పుడు మొదటిసారి ఈ రంగంలో సమిష్టి కృషితో (టీమ్ వర్క్) పనిచేసిన సమాజాలకు, పరిషత్తులకు ఈ అవార్డుతో గుర్తింపు లభించనుంది. నాటక రంగంపై ఆసక్తిగల కళాప్రియులకు వేదిక కల్పించి, ఆ రంగం వృద్ధికి గణనీయమైన కృషి చేసిన సమాజాలు, పరిషత్తులకు రూ. 5,00,000 నగదు, ‘వైఎస్సాఆర్’ ప్రతిమ మొమెంటోతో సత్కరిస్తూ అరుదైన గౌరవం నాటక సమాజాలకు ప్రభుత్వం కల్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ రంగంలో నిపుణులు మొత్తం 27 మంది న్యాయ నిర్ణేతలుగా ఈ ఏడాది నంది నాటకాల ప్రాథమిక, తుది ఎంపిక కోసం పనిచేస్తున్నారు. వారికే ఈ రెండు అవార్డులు కోసం వచ్చిన ఎంట్రీలు నుంచి అర్హులను ఎంపికచేసి బాధ్యతను అప్పగించడం జరిగింది. కాగా ‘ఎన్ఠీఆర్’, ‘డా. వై.ఎస్.ఆర్’. అవార్డుల ఎంట్రీలకు తుది గడువు డిసెంబర్ 20వరకు పొడిగించడం జరిగింది. దరఖాస్తులు మెయిల్ ద్వారా పంపడానికి, మా సంస్థకు దరఖాస్తులు పంపుటకు చివరి తేది:20.12.2023 గా పొడిగించారు.
బాలల, కళాశాల విద్యార్థిల నాటకల విభాగాల్లో వ్యక్తిగత బహుమతులను వచ్చే సంవత్సరం నుండీ బహుమతులను ఇచ్చేలా సంస్థ చూస్తుంది. గుంటూరు కలెక్టర్ ఆధ్వరంలో ఇందుకోసం ఇప్పటికే స్థానికంగా ఏర్పాట్లు చూడడానికి సంబంధిత శాఖల అధికారులకు సూచనలు ఇస్తున్నారు. స్థానిక కళాకారులతో, అధికారులతో నిర్వహణ కమిటీ, ఆహ్వాన కమిటీ, స్టేజీ కమిటీ, ఆడిటోరియం కమిటీ, ఆతిథ్య కమిటీ, వసతి సదుపాయాలు, రవాణా కమిటీ ప్రెస్ సమన్వయ కమిటీ, తదితర కమిటీలను ఏర్పాటు చేసి పోసాని క్రిష్ణ మురళి ఆధ్వరంలో సమావేశం జరిగింది. నంది అవార్డులు జరుగుటకు అందరు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరక్టర్ టి. విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆదరణ తగ్గుతున్న ఈ రంగానికి ప్రభుత్వం నుంచి కొత్తగా లభిస్తున్న ఇటువంటి ప్రోత్సాహం వల్ల, మళ్ళీ దీనికి పూర్వ వైభవం లభించాలనే కళాభిలాషుల ఆకాంక్ష నెరవేరనుంది. ఇటువంటి ప్రభుత్వం చొరవ వల్ల నాటక రంగంలోకి కొత్తగా యువతరం ప్రవేశించే అవకాశం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో సంస్థ జనరల్ మేనేజర్ ఎం. శేషసాయి, తదితరులు పాల్గొన్నారు.