విజయవాడ : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో చంద్రబాబు జోక్యం లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న స్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు కానీ, టీడీపీ కానీ జోక్యం చేసుకోలేదని గుర్తు చేశారు. గాంధీభవన్ వద్ద టీడీపీ జెండాలకు, చంద్రబాబుకు సంబంధమేంటని ప్రశ్నించారు. చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలుతున్న వైసీపీ నేతలను నియంత్రించాల్సిన బాధ్యత జగన్‌దేనని, ఇష్టారీతిగా మాట్లాడితే తాము కూడా అదే రీతిలో స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఏపీని వదిలేందుకు చాలామంది వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ నుంచి సస్పెండ్ అయిన కొడాలి నాని వైసీపీలోకి వెళ్లారని, ఆయనిప్పుడు చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు వెంకన్న చెప్పారు. బీసీ అభ్యర్థిగా తనకు సీటు ఇస్తారన్న నమ్మకం ఉందని, ఇవ్వకుంటే తన వద్ద ఆప్షన్-బి ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో గెలవరని జోస్యం చెప్పారు.