టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
కాలనీ వాసులకు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేసిన చంద్రబాబు
బాపట్ల : తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగింది.శనివారం జమ్ములపాలెం ఎస్టీ కాలనీలో ఆయన పర్యటించారు. తుపాను వల్ల సర్వం కోల్పోయామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా లేక నాలుగు రోజులు చీకట్లోనే గడిపామని కాలనీ వాసులు తమ బాధను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో రహదారి లేక రోజులు తరబడి బురదలోనే గడిపామని స్థానికులు వాపోయారు. ఆదుకునేందుకు ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదని కాలనీ వాసులు ఆరోపించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులకు చంద్రబాబు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేశారు. బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎస్టీ కాలనీలో ఎక్కడ చూసినా వరద నీరే. నాలుగు రోజులు మీరంతా నీళ్లలోనే ఉన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలోనే ఇంత దారుణ పరిస్థితులు ఉండటం దుర్మార్గం. టీడీపీ తరపున ఒక్కో ఇంటికి రూ. 5వేల సాయం అందిస్తున్నాం. ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి రూ. 25వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలి. గత ఎన్నికల్లో తెదేపాకు ఓటు వేశారనే కాలనీ వాసులపై కక్షగట్టారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రైతుల బాధలు పట్టించుకోని సీఎంను దేవుడు కూడా క్షమించడు : రైతులను మోసం చేయడం చాలా సులువని సీఎం జగన్ అనుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో తుపాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు చేయలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారట! అని ఎద్దేవా చేశారు. విత్తనాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం అవసరమా? అని రైతులను ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ముద్దులు పెట్టడం.. ఆ తర్వాత పిడిగుద్దులు గుద్దడంలో, నేరాలు చేయడంలో జగన్ దిట్ట అని విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తుపానులు రాకముందే పంట చేతికి వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నాం. పట్టిసీమ ద్వారా రైతులకు సాగునీరు ఇచ్చిన ప్రభుత్వం మాది. నేను కట్టాను కనుకే పట్టిసీమ ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వలేదు. ఎక్కడ చూసినా రోడ్లు బాగాలేవు..మురికి కాల్వలు గాలికి వదిలేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఎవరి జీనవ ప్రమాణాలైనా పెరిగాయా? వైసీపీ నేతలకు ఇసుకపై ఉన్న ప్రేమ రైతులపై లేదు. దేశంలోనే ఎక్కువ అప్పులున్న రైతులు ఏపీలో ఉన్నారు. రైతు బాధలను పట్టించుకోని సీఎంను దేవుడు కూడా క్షమించడు. మిగ్జాం తుపానుపై రైతులను ఏమాత్రం అప్రమత్తం చేయలేదు. కనీసం గోనె సంచులు ఇచ్చినా ధాన్యం ఇంటికి తెచ్చుకునేవారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా. వచ్చేది టీడీపీ -జనసేన ప్రభుత్వమే..రైతు రాజ్యం తెస్తామని పేర్కొన్నారు.