అమరావతి : ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చూసైనా ఏపీ సీఎం జగన్ సిగ్గుపడాలన్నారు. రేవంత్ సీఎం కాగానే ప్రగతి భవన్ ముందు బారికేడ్లు తొలగించి ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే రూ.9 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదిక కూల్చేశారని మండిపడ్డారు. జగన్ నియంతలా వ్యవహరిస్తూ రాష్ట్రంలో విధ్వంసక పాలన చేస్తున్నారన్నారు. జగన్ పర్యటనలన్నీ పోలీసుల మోహరింపుల మధ్య, పరదాలు, ముళ్లకంచెల మాటున సాగుతున్నాయన్నారు. గత నాలుగున్నర ఏళ్లలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రజలు కలిసేందుకు జగన్ అనుమతించలేదని విమర్శించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఇప్పటికీ కూడా గత ముఖ్యమంత్రి జయలలిత పేరుతోనే పలు కార్యక్రమాలు కొనసాగించడం గమనార్హమన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన వైఖరిలో మార్పు తెచ్చుకుని, ప్రజారంజకంగా పాలన చేయాలని రామకృష్ణ హితవుపలికారు.