దేశంలోనే రైతులు ఎక్కువ అప్పుల పాలైంది ఏపీలోనే
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
అమరావతి : తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటనకు వెళ్తున్నానని, అందుకే ఇప్పుడు సీఎం జగన్ హడావుడిగా బయల్దేరారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తన పర్యటన ఖరారైతే తప్ప జగన్‌లో కదలిక రాలేదని వ్యాఖ్యానించారు. మిగ్జాం తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు చంద్రబాబు బయల్దేరారు. ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెనాలికి వెళ్తూ మార్గమధ్యంలో ఆగారు. రేవేంద్రపాడు వద్ద రైతులను ఆయన పరామర్శించారు. ప్రభుత్వం ఇంతవరకు పంట నష్టం అంచనాకు రాలేదని చంద్రబాబు ఎదుట వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ‘‘ప్రజల కష్టాలు ఇక మూడు నెలలే. పొలాల్లో ఉండి రైతు కష్టాలు తెలుసుకోవాల్సిన మంత్రులెక్కడ? పంట నష్టపరిహారం నేను పెంచుకుంటూ వెళ్తే జగన్ తగ్గించారు. కనీసం పంట బీమా ప్రీమియం కూడా చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రైతులు ధైర్యంగా ఉండాలని అన్నారు. అనంతరం నందివెలుగు వద్ద దెబ్బతిన్న పంటలను చంద్రబాబు పరిశీలించారు.
మరో మూడు నెలల తర్వాత ఏపీలో తెలంగాణ పరిస్థితే : తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉందని.. అహంకారం ఉంటే ఏమౌతుందనేది తెలంగాణలో చూశామన్నారు. తెలంగాణ ఎన్నికల్లో రెండు దఫాలు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగా కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉందని.. అహంకారం ఉంటే ఏమౌతుందనేది తెలంగాణలో చూశామన్నారు. మరో మూడు నెలల తర్వాత ఏపీలో తెలంగాణ పరిస్థితే అంటూ చంద్రబాబు కామెంట్స్ చేశారు.
ఎంతో మానసికక్షోభ అనుభవించా : శుక్రవారం తెనాలి నియోజకవర్గం నందివెలుగులో దెబ్బతిన్న పంట పొలాలను చంద్రబాబు పరిశీలించారు. పొలాల్లోకి దిగి నీట మునిగిన చేనును స్వయంగా పరిశీలించారు. తుపాను వల్ల పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మానవ తప్పిదం వల్లే రైతులు తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వ తప్పిదాలు ప్రశ్నిస్తే, తనలాంటి వాళ్లని కూడా జైల్లో పెడతారన్నారు. చేయని తప్పుకు ఎంతో మానసిక క్షోభ అనుభవించానన్నారు. ముందస్తు చర్యలతో నష్ట నివారణ చర్యలకు అన్ని అవకాశాలు ఉన్నా, ప్రభుత్వం సకాలంలో స్పoదించలేదపి మండిపడ్డారు. కౌలు రైతుల్ని చూస్తే గుండె తరుక్కుపోతోందని ఆవేదన చెందారు. ప్రభుత్వం రైతుల్ని ఆదుకోకుంటే, నష్టపోయిన ప్రతీ రైతుని 3 నెలల తర్వాత తానే ఆదుకుంటానని హామీ ఇచ్చారు. కౌలు రైతుల్ని కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానన్నారు.
దేశంలోనే రైతులు ఎక్కువ అప్పుల పాలైంది ఏపీలోనే : కరువు వల్ల సగం మంది పంట వేయలేదన్నారు. పంట వేసిన వారంతా తుపాను వల్ల నష్టపోయారని తెలిపారు. దేశంలోనే రైతులు ఎక్కువ అప్పుల పాలైంది ఏపీలోనే అని చెప్పుకొచ్చారు. పట్టిసీమ నీరు ముందుగా వదిలి ఉంటే ఈ పాటికి రైతులు పంటల్ని కాపాడుకుని ఉండేవారన్నారు. తన షెడ్యూల్ ఖరారవుతే కానీ ముఖ్యమంత్రిలో కదలిక లేదన్నారు. వరి రైతులకు ఎకరాకు రూ.50 వేలు పైనే నష్టం వాటిల్లిందన్నారు. 2011 లోనే నష్టపరిహారం కింద రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.10,000 ఇచ్చామని గుర్తుచేశారు. ఇప్పుడు ఎకరాకు రూ.30,000 ఇస్తే గానీ రైతులకు గిట్టుబాటు కాదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోతే మరో మూడు నెలలు గడిస్తే టీడీపీ అధికారంలోకి రాగానే తామే రైతులకు ఇస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.