విజయవాడ : ప్రతి మనిషి జీవితానుభవంలో లెక్కలతో అనుబంధమై ఉంటుంది, కాబట్టి బాల్య దశలోనే గణితంపై పట్టుసాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సమగ్రశిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో జె-పాల్ (అబ్దుల్ లతీఫ్ జమీల్ పోవర్టీ యాక్షన్ ల్యాబ్) ఆధ్వర్యంలో ఫౌండేషనల్ స్కూల్ ఉపాధ్యాయులకు ‘ఆటలతో గణిత బోధన’ అంశంపై జరుగుతున్న వర్క్ షాప్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ విద్యార్థుల్లో లెక్కలంటే భయం పారద్రోలేలా సరదా ఆటలతో లెక్కలు నేర్పించాలని, అందుకోసం ఆసక్తికరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. విద్యా సాధనలో పేదరికం ఒక అడ్డు కాదని, ప్రతి ఒక్కరూ నాణ్యమైన విద్యను అందిపుచ్చుకునేలా ఉపాధ్యాయులు నిబద్ధతతో పని చేయాలని ఆకాంక్షించారు. పేదరికాన్ని జయించేలా విద్యా విధానాలు కొనసాగించాలని, విద్య ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. అంకెలు, సంఖ్యలు మెలుకువలు నేర్చుకుని పిల్లలకు అర్థవంతమైన ఆహ్లాదకరమైన అభ్యాసాలను నేర్చుకునేలా ప్రేరేపించాలన్నారు. ఈ ప్రాజెక్టులో ప్రపంచ ఖ్యాతి గాంచిన విద్యావేత్తలు, ప్రొఫెసర్లతో రూపొందించిన క్రీడా విద్య మాడ్యూళ్ల ద్వారా సులభంగా నేర్చుకోవడమే కాకుండా నిత్య జీవితంలో వినియోగించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో శామో జాయింట్ డైరెక్టర్ బి.విజయభాస్కర్ గారు, జె-పాల్ బృంద సభ్యులు, ఎస్సీఆర్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.