సీఎం ఆమోదంతో కేంద్ర బృందాన్ని పంపాలని వెంటనే కేంద్రానికి లేఖ
పంట పొలాల్లో నీటిని తొలగించి వెంటనే ఎన్యుమరేషన్ ప్రక్రియ చేపట్టండి
ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి కాగానే పంటలు దెబ్బతిన్న రైతులకు ఇనపుట్ సబ్సిడీ
ప్రాధమిక అంచనా ప్రకారం 1.45 హెక్టార్లలో వరి,31వేల 498 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం
తడిసిన,రంగుమారిన ధాన్యం కొనుగోలు నిబంధనల సడలింపునకై కేంద్రానికి లేఖ
జిల్లా కలక్టర్లోతో వీడియో సమావేశంలో సిఎస్.డా.జవహర్ రెడ్డి
వెలగపూడి సచివాలయం : రాష్ట్రంలో మిచాంగ్ తుఫాను వల్ల కలిగిన పంట నష్టం అంచనాలను త్వరిత గతిన చేపట్టడంతో పాటు తుఫాను పరిస్థితుల నుండి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలక్టర్లను ఆదేశించారు. తుఫాను అనంతర సహాయ పునరుద్ధరణ చర్యలపై గురువారం సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. తుఫాను అనంతరం విద్యుత్ సరఫరా,రహదారులు,తాగునీటి సౌకర్యం పున రుద్ధరణ, పంట నష్టాల అంచనా తదితర అంశాలపై సిఎస్ సమీక్షించారు.
ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ పంట నష్టం అంచనాకు సంబంధించి ఎన్యుమరేషన్ ప్రక్రియను చేపట్టాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖలతో పాటు జిల్లా కలక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆమోదంతో తుఫాను నష్ట పరిశీలనకు రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపడం జరుగుతుందని చెప్పారు. ఈలోగా తుఫాను సహాయ పునరావాస చర్యలను వేగవంతం చేయాలని కలక్టర్లను ఆయన ఆదేశించారు. ముఖ్యంగా పంట పొలాల్లో నిలిచిన నీటిని పొలాల నుండి కిందికి తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ప్రాధమిక అంచనా ప్రకారం లక్షా 45వేల 795 హెక్టార్లలో వరి,31వేల 498 హెక్టార్లలో వివిధ ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి కాగానే పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని అందించడంతో పాటు నూరు శాతం బీమా సౌకర్యం వర్తింప చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.అదే విధంగా తడిసిన,రంగు మారిన ధాన్యం సేకరణకు సంబంధించిన నిబంధనల సడలింపునకు కేంద్రానికి లేఖ వ్రాయడం జరుగుతుందని సిఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , సిసిఎల్ఏ జి.సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటి వరకూ తుఫానుకు ప్రభావితమై పునరావాస కేంద్రాలల్లో చేర్చిన 9వేల 321 కుటుంబాలకు కుటుంబానికి 2వేల 500 రూ.లు వంతున సహాయం, పునరావాస కేంద్రాలకు వచ్చిన ఒకే వ్యక్తి అయితే 1000 రూ.లు వంతున 1162 మందికి సహాయం కింద మొత్తం సుమారు రెండున్నర కోట్ల రూ.లు వరకూ సహాయం అందించినట్టు తెలిపారు.అదే విధంగా తుఫానుకు ప్రభావితమైన లక్షా 1 వేయి కుటుంబాలకు ఇప్పటికే 65వేల 256 కుటుంబాలకు 25 కిలోలో బియ్యం,కిలో కందిపప్పు,కిలో పామాయిల్, కిలో ఉల్లిపాయలు,కిలో బంగాళా దుంపలు వంటి నిత్యావసర సరకులను పంపిణీ చేయగా మిగతా కుటుంబాలకు కూడా త్వరగా అందించడం జరుగుతోందని వివరించారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వర్చువల్ గా పాల్గొని మాట్లాడుతూ తుపాను వల్ల 9 జిల్లాల్లో 33 కెవి ఫీడర్లు 210 తోపాటు 11కెవి ఫీడర్లు 1581,అదే విధంగా 33/11కెవి ఫీడర్లు 353 ప్రభావితం కాగా 33 కెవి స్తంభాలు 379 దెబ్బతినగా 11కెవికి సంబంధించి 1592 స్తంభాలు,2481 ఎల్టి పోల్స్ దెబ్బతిన్నాయని వాటన్నింటినీ వేగవంతంగా పునరుద్ధరించడం జరుగుతోందని వివరించారు.మొత్తం 3వేల 292 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగ్గా ఇప్పటికే 3వేల 111 గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరించగా మిగతా 181 గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ జరుగుతోందని వివరించారు.
వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ ప్రాధమిక అంచనా ప్రకారం తుఫాను వల్ల 92వేల 577 హెక్టార్లలో వరి నీట మునగగా,53వేల 218 హెక్టార్లలో వరి నేలకొరిగిందని మొత్తం 1 లక్షా 45 వేల హెక్టార్లలో వరి పంట దెబ్బతిందని తెలిపారు.ఈనెల 11నుండి పంట నష్టం అంచనా ఎన్యుమరేషన్ ప్రక్రియను ప్రారంభించ నున్నట్టు చెప్పారు.అదే విధంగా 31వేల 498 హెక్టార్లలో అరటి,బొప్పాయి తదితర ఉద్యాన వన పంటలకు కూడా నష్టం వాటిల్లిందని వివరించారు.దెబ్బతిన్న పంటలన్నిటికీ నూరు శాతం బీమా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
*పశు సంపద,బోట్లు,వలలు నష్టపోయిన బాధితులకు శుక్రవారం సాయంత్రానికి ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి చేసి నిబంధనల ప్రకారం నష్ట పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ వీడియో సమావేశం ద్వారా పాల్గొని మాట్లాడుతూ 55 రహదారులకు సంబంధించి 93.8 కిలోమీటర్ల పొడవున రహదారులు దెబ్బతిన్నాయని వాటిని యుద్ధ ప్రాతి పదికన పునరుద్ధ రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. టిఆర్అండ్ బి కార్యదర్శి ప్రద్యుమ్న వీడియో సమావేశం ద్వారా మాట్లాడుతూ 2వేల 816 కిలో మీటర్ల మేర ఆర్డ్ అండ్బి రోడ్లు దెబ్బతిన్నగా వాటిని యుద్ద ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నట్టు చెప్పారు.సిడిఎంఏ కోటేశ్వరరావు వీడియో సమావేశం ద్వారా మాట్లాడుతూ 14 వివిధ స్థానిక సంస్థల్లో 56.7 కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బతినడంతో పాటు 2వేల 770 వీధి దీపాలు దెబ్బతిన్నట్టు వివరించారు.*
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్ వీడియో సమావేశం ద్వారా మాట్లాడుతూ కల్లాలపై ఉన్న ధాన్యాన్ని సమీప మార్కెట్ యార్డులు,గోదాములకు తరలించి కాపాడేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకున్నామని తెలిపారు.అంతేగాక ఆప్ లైన్ విధానంలో కూడా రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతోందని చెప్పారు. ఇంకా ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్, వీడియో లింక్ ద్వారా వివిధ జిల్లాల కలక్టర్లు,ఇతర అధికారులు పాల్గొన్నారు.