ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయను
ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగాలి
విశాఖపట్నం ఏఎస్ రాజా గ్రౌండ్లో బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్
విశాఖపట్నం : విశాఖ ఉక్కు అంశం భావోద్వేగంతో కూడిన అంశమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జీవితంలో ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నా, ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయనని ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విశాఖలోని ఎస్.రాజా గ్రౌండ్లో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. విశాఖ ఉక్కు అంశం భావోద్వేగంతో కూడిన అంశమని అన్నారు. ఇదే విషయాన్ని కేంద్రంలోని పెద్దలకు సైతం చెప్పినట్లు పవన్ తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఎలాంటి భావోద్వేగాలకు దారి తీస్తుందో తెలియదన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ పోరాటం.. అన్ని జిల్లాలను ఏకం చేసిన నినాదం అని.. ప్రైవేటీకరణ కాకుండా ప్రయత్నం చేయగలిగామన్నారు. తాను ఎప్పుడూ ఎన్నికల కోసం ఆలోచించలేదని, ఒక తరం కోసం ఆలోచించినట్లు చెప్పారు. ఈ తరాన్ని కాపాడుకుంటూనే రాబోయే తరం కోసం పని చేస్తానన్నారు. తాను ఓట్ల కోసం రాలేదని, మార్పు కోసం ఓట్లు కావాలని పవన్ వెల్లడించారు.
ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగాలి : అధికారం కోసం ఓట్లు అడగను. మార్పు కోసం ఓట్లు అడుగుతా. ఉత్తరాంధ్ర చైతన్యం ఉన్న నేల. అందరినీ ఆహ్వానించే నేల. ఉత్తరాంధ్ర ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగాలి. ఇక్కడే ఉపాధి అవకాశాలు ఉండాలి. కష్టం వస్తే ఆదుకుంటామని చెప్పేందుకే జాలర్లను ఆదుకున్నా. పదవుల కోసం నేను ఎప్పుడూ ఆలోచించలేదు. మీ ప్రేమ, అభిమానంతోనే పార్టీని నడపగలుగుతున్నా. ఉత్తరాంధ్రలో కాలుష్యం బాగా తగ్గాలి. ఉత్తరాంధ్రలోని 24 బీసీ కులాలను తెలంగాణలో గుర్తించడం లేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇక్కడి వైసీపీ నేతలు ఎందుకు అడగలేదు? ఉత్తరాంధ్ర ప్రజలకు వైసీపీ నేతలు నష్టం చేస్తున్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ (డీసీ) లాభాలో బాటలో ఉందంటే నేను చేసిన కృషే కారణం. స్టీల్ ప్లాంట్ గురించి ఒక్కరు మాట్లాడటం లేదు. జనసేనకు అండగా నిలబడితే స్టీల్ ప్లాంట్ కోసం నేను పోరాటం చేస్తా. ఏ అధికారం లేని నేనే ఇంత చేస్తుంటే.. వైకాపా నేతలు ఎంత చేయాలి?. జనసేనకు ఒక్క ఎంపీ ఉంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు తెచ్చే వాడినని పవన్ కల్యాణ్ వివరించారు.
సీఎం ఎవరనేది నేను..చంద్రబాబు కలిసి నిర్ణయిస్తాం : జీవితంలో ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నా. నా ఓటమి తర్వాత కూడా విశాఖ ప్రజలు నాతో ఉన్నారు. విశాఖ ప్రజలు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం గట్టిగా నిలబడాలి. ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయను. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు భద్రత కావాలి. ఆడపిల్లల అదృశ్యంపై మాట్లాడితే నన్నంతా ఎగతాళి చేశారు. అమిత్ షా లాంటి వ్యక్తులు చెబితేనే నేను మాట్లాడా. ఈ ప్రభుత్వం పోలీసులను సమర్థంగా వినియోగించడం లేదు. తెదేపా-జనసేన ప్రభుత్వం వస్తే పోలీసు శాఖకు పూర్వవైభవం తీసుకొస్తాం. సమర్థులైన పోలీసు అధికారులను నియమించి శాంతిభద్రతలు కాపాడుతాం. బాధ్యతగా మాట్లాడేవారు ఉంటేనే వ్యవస్థలు సరిగా పనిచేస్తాయి. గెలిచిన అన్ని చోట్లా విజయం సాధిస్తేనే మనం బాగా సేవ చేయగలం. రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలి. విడిపోయిన రాష్ట్రానికి మేలు జరుగుతుందనే 2014లో భాజపాకు మద్దతిచ్చా. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించాల్సి ఉంది. సీఎం ఎవరనేది నేను, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి నిర్ణయిస్తామని పవన్ అన్నారు.
నిరుద్యోగులకు అన్యాయం : 151 సీట్లతో వైసీపీని గెలిపించినా ఇప్పటి వరకూ ఒక్కటీ సరైనా ఉద్యోగం ఇవ్వలేదని, నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ పోరాటం.. అన్ని జిల్లాలను ఏకం చేసిందని, విశాఖ ఉక్కు అంశం భావోద్వేగంతో కూడినది అని పవన్ అన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర పెద్దలకు చెప్పానని, విశాఖ ఉక్కుపై తన అభిప్రాయాన్ని అమిత్ షా గౌరవించారని తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ప్రయత్నం చేయగలిగామన్నారు. యువత కోసమే తన ఆలోచన అంతా అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఏపీలో టీడీపీ-జనసేన ప్రభుత్వానిదే అధికారం. 2024 ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోతారు. మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆరే ఓడిపోయారని నాగబాబు అన్నారు.
[https://bloomtimes.org/images/srilekha_/pspk%20janasena.png]