తణుకు : రాష్ట్రంలో తుఫాన్ నేపథ్యంలో తేమతో సంబంధం లేకుండా ధాన్యాన్ని రైతుల నుంచి మిల్లర్లు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. మంగళవారం ఆయన తణుకు మండలం దువ్వ, అత్తిలి మండలం వరిగేడు గ్రామాల్లో వర్షాల కారణంగా కళ్ళాల్లో ఉన్న ధాన్యం రాశులను పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి రైతులతో మాట్లాడుతూ తుపాను కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమాయత్తం చేశారని చెప్పారు.
భారీ వర్షాల కారణంగా కళ్ళాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలని, అందుకు తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైస్ మిల్లర్లను కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కారణంగా ఇప్పటి వరకు 1లక్ష 7వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఆఫ్ లైన్ లోకొనుగోలు చేసినట్లు చెప్పారు. వీటికి సంబంధించి మొత్తం రూ. 1140 కోట్లకు రూ.800 కోట్లను ఇప్పటికే రైతుల ఖాతాలకు జమ చేసినట్లు చెప్పారు. మరో రూ. 200 కోట్లను అందజేస్తామన్నారు. ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్తలు కారణంగా రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం లేదన్నారు. రైతులు సాగు చేసిన స్వర్ణ రకం పంటను 98 శాతం మాసూళ్ళు పూర్తయినట్లు చెప్పారు. మిగిలిన రకాల పంటలు అవి దృడంగా ఉండటంతో గాలులకు నేలకొరిగే అవకాశం లేదని దీనివలన పంట నష్టం ఏమీ జరగదని చెప్పారు. రైతులకు ఏవిధమైన పంట నష్టం జరగకుండా ఆదుకుంటామని మంత్రి కారుమూరి హామీ ఇచ్చారు.