చెరువులను తలపిస్తున్న పంట పొలాలు
*నెల్లూరులో నీటమునిగిన మాగుంట లేఅవుట్
గుంటూరు : తీవ్ర తుపాను మిచాంగ్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. ఈ మేరకు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మిచాంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, నెల్లూరు జిల్లాలో గాలుల తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ వర్షాలు కొనసాగనున్నాయి. తుఫాను ఉత్తర దిశగా నెమ్మదిగా ముందుకు కదులుతోంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 100 కిలోమీటర్లు కొన్నిసార్లు 110 కిలోమీటర్లు గాలులు వీచనున్నాయి. ముంపు ప్రాంతాల్లో సముద్రం కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని హెచ్చరించారు. ఇటు రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు ఓ మోస్తారుగా కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. తుపాను తీరం దాటుతున్న నేపథ్యంలో బాపట్ల తీర ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. సముద్రంలో అలలు సుమారు 2మీటర్ల మేర ఎగసిపడుతున్నాయి. తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పలు తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరిగింది. రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లోనూ తుపాను ప్రభావం కనిపించింది. వరి, పొగాకు, పసుపు, అరటి పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.
కూలిన వృక్షాలు..రహదారులు జలమయం : మిగ్జాం తీవ్ర తుపాను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను వణికిస్తోంది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో పలుచోట్ల వృక్షాలు నేలకొరిగాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. ఉండి, భీమవరం, కాళ్ల తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చేతికందిన పంట కల్లాల్లోనే ఉండిపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల కోసిన వరి పంట పొలాల్లోనే మునిగిపోయింది. ముదినేపల్లి, కలిదిండి, పెదపాడు, నూజివీడు, భీమవరం, పాలకొల్లు, పెనుమంట్ర తదితర చోట్ల వరి పంట నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద భారీగా నీరు నిలిచిపోయింది. ఆస్పత్రి లోపల కూడా నీరు చేరడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. పెదవేగి, పెదపాడు, వట్లూరు తదితర ప్రాంతాల్లో రహదారికి అడ్డంగా చెట్లు కూలిపోయాయి. పోలవరం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, టి.నరసాపురం తదితర మండలాల్లో వేరుశనగ, పొగాకు, మినుము పంటలు నీట మునిగాయి.
చెరువులను తలపిస్తున్న పంట పొలాలు : ‘మిగ్జాం’ ప్రభావంతో గుంటూరు జిల్లాలోని వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఎటు చూసినా పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. కాకుమాను, కొండపాటూరు, కొమ్మూరు, అప్పాపురం, గార్లపాడు, రేటూరు, బీకే పాలెం, బొడిపాలెంలో పంటలు పూర్తిగా నీటమునిగాయి. కొండపాటూరులోని పోలేరమ్మ గర్భగుడిలోకి వర్షపు నీరు చేరింది. ఆలయ కమిటీ సభ్యులు ఇంజిన్లతో నీటిని బయటకు తోడుతున్నారు. కాకుమాను, అప్పాపురం చాప్టాలపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు ప్రకాశం జిల్లా కొండపి మండలం చిన్న వెంకన్నపాలెం వద్ద తుపాను ధాటికి భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో కొండపి – టంగుటూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
నెల్లూరులో నీటమునిగిన మాగుంట లేఅవుట్ : మిగ్జాం తీవ్ర తుపాను ప్రభావంతో నెల్లూరులో భారీ వర్షం కురిసింది. నగరంలోని మాగుంట లేఅవుట్ పూర్తిగా నీటమునిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరు మాగుంట లేఅవుట్ను ముంచెత్తింది. పలు దుకాణాల్లోకి వరద నీరు ప్రవేశించడంతో అందులోని సామాగ్రి దెబ్బతింది. ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అంతర పంటలు దెబ్బతిన్నాయి.