న్యూఢిల్లీ : ఎన్నికల హామీల్లో ఉచితాలకు తాను పూర్తి వ్యతిరేకమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆర్ధిక పరిస్థితులు, భవిష్యత్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఆర్ధిక వనరులు ఉంటాయా అని అంచనా వేయకుండా హామీలు ఇస్తుంటారని విమర్శించారు. పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను పొడిగిస్తూ మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఎందుకంటే దేశంలో పేద, మధ్యతరగతి, మధ్యతరగతికి దిగువన అనేక మంది ప్రజలు ఉన్నారని మాజీ ఉపరాష్ట్రపతి అన్నారు.
ఢిల్లీ కాలుష్యం జాతీయ సమస్య : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యంపై మాట్లాడుతూ ఢిల్లీ కాలుష్యం జాతీయ సమస్య అని చెప్పుకొచ్చారు. కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతోందన్నారు. కాలుష్య నియంత్రణ అనేది ఢిల్లీ ప్రభుత్వానిదే కాదు కేంద్రం, పక్క రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కూడా అని అన్నారు. ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు జీవిస్తున్నారని తెలిపారు. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణకి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది చాలా కీలక సమయమని, మాజీ ఉపరాష్ట్రపతిగా ప్రజా జీవితంలో ఉన్న సమస్యలను పరిశీలిస్తున్నట్లు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.