విజయవాడ కేంద్రంగా నవంబర్ 14, 15 న 30 గంటల దీక్ష
సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ
విజయవాడ : కృష్ణా జలాల పునఃపంపిణీ పై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చీకటి చట్టం – ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ప్రస్తుత కరువు పరిస్థితులపై రైతులతో ముఖాముఖి కార్యక్రమం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి ఆద్వర్యంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కేసి కెనాల్, ఎస్ ఆర్ బి సి, ఎల్ఎల్ సి, హెచ్ ఎల్ సి, లకు ఉన్న నీటి హక్కులలో కోత విధించి, ఆ నీటిని తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించే వెసలుబాటును కలిగిస్తూ ఈ చీకటి చట్టం తెచ్చినా పాలకులలో చలనం లేకపోవడాన్ని బొజ్జా తీవ్రంగా విమర్శించారు. పోలవరం నిర్మాణం ద్వారా కృష్ణా జలాలు ఆదా అయ్యి రాయలసీమకు లబ్ది జరగడం అటుంచి, ఈ చీకటి చట్టంతో రాయలసీమకున్న నీటి హక్కులలో మరో 6.5 టిఎంసి ల కోతపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం రద్దు దిశగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఉద్యమం చేయడానికి రైతులు, విద్యార్థులు, మహిళలు, ప్రజలు సిద్దం కావాలని బొజ్జా దశరథ రామిరెడ్డి పిలుపునిచ్చారు.
స్థానిక ప్రజా ప్రతినిధుల ప్రకటనలతో రాయలసీమ ప్రాంతంలో రైతాంగం మిరప, వరి తదితర పంటలు వేసుకొని, నేడు నీరందకు ఈ పంటలన్నీ దున్ని వేసే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్త పరిచారు. రాయలసీమలోని రైతాంగం వేసిన అన్ని పంటలకు ఈ క్రాపింగ్ ద్వారా పంటల బీమా క్రింద పూర్తి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చీకటి జీవోపై, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని బొజ్జా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన నోటిఫికేషన్ ద్వారా బిజేపి తెలంగాణ ఎన్నికలలో లబ్ది పొందడానికి, ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులను తాకట్టు పెట్టిందని తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి తన రాజకీయ లబ్ధికోసం మౌనంగా ఉండటాన్ని తీవ్రంగా ఖండించారు. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ సాగునీటి హక్కులను కాపాడటానికి కార్యాచరణ చేపట్టామని తెలిపారు. ఈ చట్టంను రద్దు చేయడానికి విజయవాడ కేంద్రంగా 30 గంటల దీక్ష నవంబర్ 14, 15 చేపట్టామని, ఈ దీక్షలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేస్తుంటే కాబినెట్ సమావేశంలో కనీసం ఈ అంశంపై చర్చ కూడ చేయకపోవడం పాలకులకు వ్యవసాయ రంగం పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియచేస్తుందని విమర్శించారు. తక్షణమే రాష్ట్రంలో కరువుతో అల్లాడుతున్న నాలుగు వందల పై చిలుకు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నంద్యాల జిల్లాలోని వివిధ మండలాల నుండి రైతు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిపిఐ పార్టీ నాయకులు రంగనాయకులు, రంగం ముని నాయుడు, బాబ ఫకృద్దీన్, రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు ఏర్వ రామచంద్రా రెడ్డి, కార్యదర్శి మహేశ్వర రెడ్డి, పౌరసంబంధాల కార్యదర్శి సుధాకర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.