విజయవాడ : సర్పంచ్లకు నిధులు, విధులు ఇవ్వకుండా ముఖ్యమంత్రి జగన్రెడ్డి మోసం చేశారని సర్పంచ్ల సంఘం గౌరవ అధ్యక్షులు బాబూరాజేంద్రప్రసాద్ అన్నారు. ఏపీ సర్పంచ్ల సంఘం ప్రతినిధులు పంచాయతీ ఛాంబర్ కార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. జగన్మోహన్రెడ్డి నిధుల మళ్లింపుపై మరోసారి కేంద్రానికి ఫిర్యాదులు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వందరోజుల కార్యాచరణతో వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు సాగించేలా తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా బాబూరాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఉద్యమించాం.14, 15 ఆర్ధి సంఘం నిధులు 8620కోట్ల రూపాయలను జగన్ దొంగిలించారు. కేంద్రానికి ఫిర్యాదు చేస్తే.. కేంద్ర కమిటీ వచ్చి విచారణ చేసి నిర్ధారించారు. కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల నిధులు వారికి ఇచ్చేయాలని ఆదేశించింది. దీనిపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2022, 23 ఆర్ధిక సంవత్సరానికి చెందిన నిధులు 936 కోట్లు కూడా ఆగిపోయాయి. 23-24 ఆర్ధిక సంవత్సరం నిధులు 2031కోట్ల నిధులు కూడా ఆపేశారు. దీంతో గ్రామాలల్లో తాగునీరు అందించడానికి కూడా ఒక్క రూపాయి లేని దుస్థితి. గ్రామాలల్లో ప్రజలకు జవాబు చెప్పలేక సర్పంచ్లు అవమానాలు ఎదుర్కొంటున్నారు. రెండో దశ ఉద్యమాన్ని చేపట్టాలని ఈరోజు కార్యాచరణపై సమావేశం అయ్యాం. ఉద్యమాల ద్వారా మరోసారి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని బాబూ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
ఆ నివేదిక బయట పెట్టలేదు : సర్పంచ్ గళ్లా తిమోతి
గ్రామాభివృద్ది కోసం కేటాయించిన నిధులు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మళ్లించిందని సర్పంచ్ గళ్లా తిమోతి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రానికి చేసిన ఫిర్యాదులతో కేంద్ర కమిటీ వచ్చి పరిశీలించింది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని కమిటీ నివేదిక ఇచ్చింది. కానీ నేటి వరకు ఆ నివేదిక బయట పెట్టలేదు. మరోసారి ఢిల్లీ వెళ్లి హోంమంత్రి, రాష్ట్రపతిని కలిసి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తాం. చెరువులు, నీరు, ఇంటి పన్నుల ద్వారా వచ్చిన డబ్బునే ఖర్చు చేస్తున్నాం. అభివృద్ధి పనులు సొంత డబ్బుతో చేస్తే.. బిల్లులు కూడా ఇవ్వడం లేదు. సర్పంచ్లకు పోటీగా వలంటీర్ల వ్యవస్థ ఎందుకో సీఎం చెప్పాలి. అంబేడ్కర్ విగ్రహం కడుతున్న జగన్ ఆయన రాసిన రాజ్యాంగాన్ని మాత్రం పట్టించుకోరా. మా సమస్యలపై వంద రోజుల ప్రణాళికను సిద్ధం చేసుకుని పోరాటం చేస్తామని సర్పంచ్ గళ్లా తిమోతి తెలిపారు.
ఏపీలో పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయి : సర్పంచ్ నూర్జా బేగం
రెండున్నరేళ్లుగా ఏపీలో పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయని మహిళా సర్పంచ్ నూర్జా బేగం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వల్ల నేడు ఢిల్లీ వరకు వెళ్లి పోరాటాలు చేయాల్సి వస్తుంది. సీఎం తెరలు కట్టుకుని తిరుగుతున్నట్లుగా గ్రామాలల్లో మేము తిరగలేకపోతున్నాం. ప్రజలు సమస్యలపై నిలదీస్తుంటే సమాధానం చెప్పలేని దయనీయ స్థితిలో ఉన్నాం. నిధులు మళ్లించడం వల్ల కనీసం వీధి లైట్లు కూడా వేయించలేకపోతున్నాం. గ్రామీణ వ్యవస్థను ఈ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసింది. సీఎం స్పందించి నిధులు ఇవ్వకుంటే పోరాటం ఉధృతం చేస్తామని మహిళా సర్పంచ్ నూర్జా బేగం పేర్కొన్నారు.