ఇప్పటికే ఎన్నికల కోసం ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే దానిపై షెడ్యూల్ కూడా ప్రకటించారు. సుమారు రెండేళ్ల క్రితం నుంచే పార్టీ కేడర్ని ప్రజల్లో మమేకం అయ్యేలా కార్యక్రమాలు చేపట్టారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రతి ఇంటికి స్థానిక ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ సమన్వయ కర్తలు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతే కాదు సంక్షేమ పథకాలు అందనివారిని గుర్తించి వెంటనే తగిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు జనానికి మరింత చేరువయ్యారు. ఇంటింటికీ వైసీపీ నాయకులు వెళ్లడం ద్వారా ప్రజల్లో వారిపట్ల మరింత గౌరవం పెరిగేలా చేసుకున్నారు. ఇక గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా స్థానిక నాయకుల పనితీరుపైనా ఒక నిర్ణయానికి వచ్చారు సీఎం జగన్. పనితీరు సరిగా లేనివారు మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. వచ్చే మూడు నెలలకు సంబంధించిన కార్యాచరణ కూడా ప్రకటించారు. జగనన్న ఆటోగ్య సురక్ష, సామాజిక సాధికార యాత్రలు, ఆడుదాం ఆంధ్రా వంటి కార్యక్రమాలతో పార్టీ కేడర్‌ను ప్రజల్లో ఉండేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న కోటీ 60 లక్షల కుటుంబాల ప్రజలకు వైద్య పరీక్షలు, ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్సలు అందిస్తున్నారు.మరోవైపు అక్టోబర్ 26 నుంచీ సామాజిక సాధికార బస్సు యాత్రలు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో మొత్తం వైసీపీ కేడర్ క్షేత్ర స్థాయిలో దూసుకెళ్లిపోతుంది.ఆయా కార్యక్రమాలపై సీఎం జగన్ శుక్రవారం ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.
బస్సు యాత్ర, తాజా రాజకీయాలపై చర్చ
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కు శ్రీకారం చుట్టింది. అక్టోబర్ 26 వ తేదీ నుంచి రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో ప్రతి రోజూ సాధికార యాత్రలు కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలకు ఏవిధంగా మేలు చేసిందో వివరించేందుకు బస్సు యాత్ర చేపట్టారు. ఈనేపథ్యంలోనే బస్సు యాత్ర జరుగుతున్న తీరు, ప్రజల నుంచి వస్తున్న స్పందనతో పాటు తాజా రాజకీయాలపై చర్చించేందుకు పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం సమావేశం అవుతున్నారు. ఉదయం కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మద్యాహ్నం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. సామాజిక సాధికార యాత్రల్లో పేదలను ఎక్కువగా పాల్గొనేలా చూడాలని సీఎం జగన్ ఇప్పటికే సూచించారు. ప్రస్తుతం యాత్రలకు జనం నుంచి స్పందన ఎలా ఉంది. సంక్షేమ పథకాలపై ప్రజలు ఏమనుకుంటున్నారనే అంశాలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. బలహీన వర్గాలు,మైనార్టీల ఓటు బ్యాంకు పూర్తిగా తమవైపే ఉండేలా ఎలా ముందుకెళ్లాలనే దానిపై నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు సీఎం జగన్.
ఇక ఇటీవల డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ జాబితా ప్రకారం ఓటర్ల లిస్ట్ పై పలు సూచనలు చేయనున్నారు. సీఎంతో జరిగే సమావేశానికి సజ్జల రామకృష్ణా రెడ్డితో పాటు పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు కొంతమంది, మరికొంతమంది ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఓటర్ల జాబితాలో వైసీపీ అనుకూల ఓట్లకు ఎక్కడా సమస్య లేకుండా మరోసారి వెరిఫికేషన్ చేసేలా పార్టీ కేడర్ కు పలు సూచనలు చేయనున్నారు..ఇక రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపైనా చర్చించనున్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలయిన తర్వాత నెలకొన్న పరిస్థితులు,ప్రజల స్పందన ఎలా ఉందనే దానిపైనా చర్చించే అవకాశం ఉంది. సమావేశంలో చర్చించే అంశాలను క్షేత్ర స్థాయిలో అమలయ్యేలా ముఖ్యనేతలకు పలు సూచనలు చేయనున్నారు ముఖ్యమంత్రి.
ప్రతి నియోజకవర్గానికి అదనంగా మరో సీనియర్ నాయకులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వై నాట్ 175 లక్ష్యం చేరుకునేందుకు సీఎం జగన్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు..ఇప్పటికే పనితీరు సరిగా లేని నేతలకు సీట్లు ఇవ్వలేనని తేల్చి చెప్పేశారు సీఎం. ఇక ఇప్పటికే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో పాటు పరిశీలకులు ఉన్నారు. తాజాగా ప్రతి నియోజకవర్గాలనికి మరో కీలక వ్యక్తిని నియమించనున్నట్లు తెలిసింది. కొత్తగా నియమించే వ్యక్తికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా కొత్త ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టేలా కొత్తగా నియమించే వారికి బాధ్యతలు అప్పగించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చి నియామకం చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల నుంచి పరిశీలకులు ఇచ్చే నివేదకిలతో పాటు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి అనుసంధానం చేసే విధంగా ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గ, పోలింగ్ బూత్ పరిధిలో తీసుకునే నిర్ణయాలకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా కొత్త వ్యవస్థ ఏర్పాటుపై సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
[https://bloomtimes.org/images/Hemalatha_/CM%20Jagan.jpg]