ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్
అంతర్ రాష్ట్ర సరిహద్దు అంశాలపై కేంద్ర ఎన్నికల కమీషన్ సిఎస్ లతో వీడియో సమావేశం
వెలగపూడి : ఈనెలలో జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అంతర్ రాష్ట్ర సరిహద్దు అంశాలపై గురువారం ఢిల్లీ నుండి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇతర కమీషనర్లతో కలిసి ఆయా రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాల సిఎస్, డిజిపి, సిఇఓ ఇతర అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ రానున్న తెలంగాణా,రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ , మధ్యప్రదేశ్, మిజోరం ఎన్నికలు పూర్తి పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఆయా రాష్ట్రాలు కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల సరిహద్దు రాష్ట్రాలు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని సిఇసి రాజీవ్ కుమార్ సూచించారు. ముఖ్యంగా అక్రమంగా మద్యం రవాణా,డబ్బు రవాణా నియంత్రణకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన తనిఖీలు చేయాలని చెప్పారు.
ఈసమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ ఈనెలలో ఎన్నికలు జరగనున్న తెలంగాణా అధికారులతో సమన్వయంతో ఉన్నామని వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్దం చర్యలు తీసుకుంటామని వివరించారు.అదే విధంగా వివిధ అక్రమ రవాణాను నియంత్రించేందుకు తెలంగాణాతో సరిహద్దు గల జిల్లాల్లో అవసరమైన చెక్కు పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేపట్టడం జరుగుతోందని ఇసికి సిఎస్ జవహర్ రెడ్డి వివరించారు.
ఈ వీడియో సమావేశంలో డిజిపి కె.రాజేంద్రనాధ్ రెడ్డి,సిఇఓ ముఖేశ్ కుమార్ మీనా, స్పెషల్ సిఎస్ రజత్ భార్గవ,హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్త,జీఎస్టీ చీఫ్ కమీషనర్ గిరిజా శంకర్,ఎస్ఇబి డైరెక్టర్ రవి ప్రకాష్,ఆర్పి మీనా తదితర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.