అమరావతి : వైసీపీని ప్రజలు ఛీకొడుతున్నా, ఆ పార్టీ నేతలు మాత్రం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మద్దతుగా ప్రజలు ర్యాలీలు చేస్తే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ నేతలకు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. కోర్టు నిబంధనలు పాటిస్తూనే రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లిలోని తన నివాసం వరకు చంద్రబాబు వాహనశ్రేణి సాగిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ రావటానికి చంద్రబాబుకు 16 గంటలు పట్టింది. కోర్టు నిబంధనలు లేకపోతే ఇప్పుడు వచ్చినదానికి నాలుగు రెట్ల జనం అధికంగా వచ్చేవారు. చంద్రబాబు నిబంధనల్ని ఉల్లంఘించకుండా కారులోనే ఉండి ప్రజలు, కార్యకర్తలకు చిరునవ్వుతో అభివాదం చేశారు. లోకేశ్ ఢిల్లీ వెళితే వైసీపీ వాళ్లకెందుకు ఉలికిపాటు? అక్రమ కేసులో చంద్రబాబును 52 రోజులు నిర్బంధించారు. ఆయన అవినీతికి పాల్పడ్డట్టు ఒక్క ఆధారం చూపించలేకపోయారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయంటూ మరో కొత్త కేసు పెట్టారు. వైసీపీ వాళ్లు ఎన్ని కుట్రలు పన్నినా టీడీపీని ఏం చేయలేరని పేర్కొన్నారు.