సీఎంవో, రాజ్ భవన్తో పాటు అన్ని జిల్లాల్లో అవతరణ ఉత్సవాలు : నవంబర్ ఒకటో తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరపాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఉత్సవంగా అత్యంత వైభవంగా జరపాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు సాధారణ పరిపాలన శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉత్సవాల్లో పాల్గొనున్నారు. రాజ్ భవన్లో జరిగే వేడుకల్లో గవర్నర్ పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం రోజున ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి జగన్ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఆ తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. తెలుగు సంస్కృతిని ప్రతిబింభించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో కూడా రాష్ట్ర అవతరణ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలోని అధికార యంత్రాంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.